మహాకవి కాళిదాసుకి, పూరీ జగన్నాథ్‌కి పోలిక ఏమిటి? కాళిదాసు అనే మహానుభావుడు 1 నుంచి 5వ శతాబ్ధ మధ్య కాలానికి చెందిన వ్యక్తి అని చెబుతారు. మరి పూరీ జగన్నాథ్ చూస్తే 55 ఏళ్ళ క్రితం పుట్టారు. ఈ ఇద్దరికీ కనెక్షన్ ఎక్కడ ఉంది? ఏ విషయంలో ఈ ఇద్దరూ ఒకేలా ఆలోచించి ఉంటారు? పూరీ జగన్నాథ్ మహాకవి కాళిదాసు గురించి తెలుసుకుని ఆయన్ని ఆచరించారా? లేక యాదృచ్చికంగా జరిగి ఉంటుందా? అసలు ఏంటా సంఘటన?
ఈ తరం జనరేషన్‌కి మహాకవి కాళిదాసు గురించి తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయనొక సంస్కృత కవి, నాటక కర్త. ‘కవికుల గురువు’ అన్న బిరుదాంకితులాయన. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు అనేక కావ్యాలు, నాటకాలు రచించారు. రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అంటే కాళి యొక్క దాసుడు అని అర్థం. ఆయనకంటూ ఒక పేరు లేదు. ఆ కాళి మాత విద్య ప్రసాదించడం వల్ల ఆయనకి కాళిదాసు అనే పేరు వచ్చింది. మన ప్రస్తుత భాషలో చెప్పాలంటే ఈయనొక డైనమిక్ రైటర్.
ఇక పూరీ జగన్నాథ్ గురించి చెప్పాల్సిన పని లేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్. తన పదునైన మాటలతో సమాజాన్ని చైతన్యపరుస్తారు. పూరీ ఏమో మనం ఉన్న టైం పీరియడ్‌కి చెందిన వ్యక్తి. కాళిదాసు ఏమో చాలా ఏళ్ల క్రితం నాటి వ్యక్తి. ఈ ఇద్దరికీ కనెక్షన్ ఎలా ఉంటుంది? అని అంటే అది దైవ సంకల్పం అవ్వచ్చు. అసలు ఈ ఇద్దరి జీవితంలో చోటు చేసుకున్న కామన్ ఇన్సిడెంట్ ఏంటి?
కాళి మాత ద్వారా విద్యను పొందిన కాళిదాసు విధ్వాంసుడు అవుతారు. ఉజ్జయినీ రాజ్యంలోని ధారా నగరంలో ఉన్న భోజరాజు ఆస్థానంలో కవి ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడ ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అనే ముగ్గురు కవులు ఉండేవారు. కవి అవుదామని ఎవరు వచ్చినా ఈ ముగ్గురూ తమ కుయుక్తులతో రాజుతో శిక్ష వేయించి పంపించేవారు. రాజ్యంలోకి వెళ్ళే ముందు కవిని ఆపి.. రాజు గారికి ఏ శ్లోకం వినిపించాలనుకుంటున్నావని అడుగుతారు. ఆ కవి ఒక శ్లోకం వినిపిస్తాడు. ఈ ముగ్గురూ ఆ కవిని తర్వాతి రోజు రమ్మని చెప్పి పంపిస్తారు. ఈలోపు ఆ శ్లోకాన్ని కంఠస్తా పడతారు. మరుసటి రోజు ఆ కవి ఆస్థానంలోకి వెళ్లి శ్లోకం వినిపిస్తాడు. అయితే అప్పటికే శ్లోకం మీద గ్రిప్ తెచ్చుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు శ్లోకాన్ని అవలీలగా చదివేస్తారు. ఇదేమీ కొత్త శ్లోకం కాదని ఆ కవిని రాజు దగ్గర దోషిని చేస్తారు. దీంతో రాజు ఆ కవిని శిక్షించి పంపిస్తాడు. ఇది అక్కడ జరిగే తంతు.
కాళికా మాత అనుగ్రహంతో కవి అయిన కాళిదాసు.. ఈ ముగ్గురి కుయుక్తులని కనిపెట్టారు. వీళ్ళు భోజరాజు దగ్గరకి కవులని చేరనివ్వడం లేదని తెలుసుకున్న కాళిదాసు.. ఏమీ తెలియని వ్యక్తిలా వారి దగ్గరకు వెళ్తారు. “తానో పేదవాడినని, భోజరాజు గారి దర్శనం కోసం వచ్చానని, ఒక శ్లోకం చెప్తే ఆయన నాకేమైనా నాలుగు డబ్బులిస్తారేమోనని వచ్చానని” అంటారు. తప్పకుండా పంపిస్తాం, శ్లోకం చెప్పు అని ముగ్గురు కవులు అంటారు. కాళిదాసు సంస్కృతంలో ఒక శ్లోకం వినిపిస్తారు. రాజుని కీర్తిస్తూ చెప్పే శ్లోకం అది. అది విన్న ముగ్గురు కవులు కాళిదాసుని రాజు దగ్గరకి తీసుకెళదామని అనుకుంటారు. మరుసటి రోజు రమ్మంటారు.
అయితే కవులు మాట్లాడుతుండగా కాళిదాసు వారి లోపాన్ని కనిపెట్టారు. ఏకసంతాగ్రాహికి నత్తి ఉండడం వల్ల కొన్ని అక్షరాలు పలకలేరన్న విషయం కాళిదాసు గుర్తిస్తారు. ఇక మరుసటి రోజు ఆస్థానంలోకి వెళ్తారు. ముందు ముగ్గురు కవులకి వినిపించిన పద్యం కాకుండా.. నోరు తిరిగే వీలు లేని విధంగా కొత్త శ్లోకం ఒకటి రాజుకి వినిపిస్తారు. ఇంకేముందు రాజు ఇంప్రెస్ అయిపోతారు. వెంటనే కాళిదాసుని ఆస్థాన కవిగా నియమిస్తారు. ఎందరో కవులని శిక్షలు పడేలా చేసిన ముగ్గురు కవుల బండారాన్ని కాళిదాసు బయటపెట్టడంతో రాజు వారిని రాజ్యం నుండి గెంటివేస్తాడు. అలా కాళిదాసు తన గోల్ కోసం తెలివిగా ఆలోచించారు.
మరి ఇదే కాళిదాసు స్ట్రాటజీని పూరీ జగన్నాథ్ తన జీవితంలో కూడా అప్లై చేశారు. పవన్ కళ్యాణ్ ని కలవడం అంటే అంత ఈజీ కాదు. ఆయనకి కథ చెప్పాలని పూరీ ఆశ. ముందు చోటా కె నాయుడుకి కథ చెప్పాలి. ఆయనకి నచ్చితే అప్పుడు పవన్ ఓకే చెప్తారు. ఆ సమయంలో పూరీకి కథ చెప్పే అవకాశం వచ్చింది. పూరీ చోటాకి కథ చెప్పారు. అయితే అది ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ. చోటా పవన్ కి ఫోన్ చేసి కథ బాగుందని చెప్పారు. పవన్ పూరీని పిలిపించి కథ విన్నారు. అయితే ఇది బద్రి కథ. చోటా నాకు చెప్పింది ఈ కథ కాదు కదా అని పవన్ అన్నారు. చోటా కె నాయుడు కూడా ఈ కథ కాదు కదా అని ఆశ్చర్యపోయారు. బద్రి అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని వాళ్ళని కన్విన్స్ చేశారు. ముందే ఎందుకు చెప్పలేదు అంటే.. చోటా కె నాయుడికి నచ్చుతుందో లేదో అని భయం. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథే నచ్చిందంటే బద్రి నచ్చకుండా ఉంటుందా అని పవన్ కోసం బద్రి కథ చెప్పారు పూరీ. ఆ విధంగా పూరీ ఇక్కడ తెలివిగా వ్యవహరించారు.
అక్కడ కాళిదాసు కథలో భోజరాజుని కలిసి, శ్లోకం వినిపించి, పని చేసే అవకాశం పొందడం కాళిదాసు లక్ష్యం. ఇక్కడ పూరీ జీవితంలో పవన్ కళ్యాణ్ ను కలిసి, కథ చెప్పి, సినిమా చేసే అవకాశం పొందడం పూరీ లక్ష్యం. అక్కడ కాళిదాసు సంస్కృత కవి, నాటక రచయిత, ఇక్కడ పూరీ రైటర్ అండ్ డైరెక్టర్. అక్కడ ముగ్గురు కవులు చెడ్డవాళ్ళు, ఇక్కడ చోటా కె నాయుడు మంచివారు. అదొక్కటే తేడా. మిగతా పాత్రలన్నీ సేమ్ టు సేమ్. కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. భోజరాజు పవన్ కళ్యాణ్ అయితే, కాళిదాసు పూరీ జగన్నాథ్ అన్న మాట. ఇంకో విశేషం ఏంటంటే.. ఇద్దరూ ఈ ఇన్సిడెంట్ తోనే తమ కెరీర్ ని స్టార్ట్ చేశారు. కాళిదాసు కవిగా, పూరీ దర్శకుడిగా కెరీర్ ని మొదలుపెట్టారు.
ఆ రకంగా కాళిదాసు జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ పూరీ జీవితంలో రీమేక్ అయ్యింది. పూరీ ఆయన్ని ఫాలో అయ్యారో లేక యాదృచ్చికంగా జరిగిందో తెలియదు కానీ మధ్యవర్తికి వేరే సబ్జెక్ట్ చెప్పి, మెయిన్ వ్యక్తికి అసలు సబ్జెక్ట్ చెప్పడం ఏదైతే ఉందో అది సూపర్ థాట్ అసలు. అసలే ఇండస్ట్రీలో కథలు లేపేస్తారన్న టాక్ ఉంది. మధ్యవర్తికి కథలు చెప్తే లేపేస్తారేమో అని భయపడేవారికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుందేమో కదా. మరి ఈ ఇద్దరి లైఫ్ లో జరిగిన సేమ్ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.