జబర్దస్త్ ప్రొగ్రాం ఎందరో ప్రతిభావంతులకు మంచి వేదిక అయ్యింది. జబర్దస్త్ ద్వారా.. ఎందరో కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఈ ప్రొగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రచ్చ రవి. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్, విలన్ పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా రచ్చ రవికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలయ్యింది. రచ్చ రవికి యాక్సిడెంట్ అయ్యిందని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని కొన్ని సైట్లు వార్తలు ప్రచురించాయి. దాంతో రచ్చ రవి పరిస్థితిపై అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై రచ్చ రవి స్పందించాడు. తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు.
సూర్యపేట, మునగాల వద్ద రచ్చ రవికి యాక్సిడెంట్ జరిగిందని.. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. వీటిపై రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు రవి. తాను పుణెలో షూటింగ్ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానని.. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నాడు. పైగా తాను హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చానని.. అందువల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. అంతేకాక శనివారం జరగబోయే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌కి కూడా హజరవుతున్నట్లు వెల్లడించాడు.
రచ్చ రవి తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన బటర్ ఫ్లై చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో మంచి నటన కనబరిచి.. ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు రచ్చ రవి. మరి సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సమంజసమేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.