నవ్వుతూ కనబడే మనిషి మొఖమే కనబడుతుంది, కానీ ఆ మనిషి వీపుకి గుచ్చుకున్న ముళ్ళు ఎవరికీ కనబడవు. సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే అనిపించే మాట, అక్కడకి వెళ్లడం చాలా ఈజీ. వారిలా చేయడం ఈజీ, వారిలా నటించడం ఈజీ, వారిలా నవ్వించడం ఈజీ, వారిలా ఉండడం ఈజీ అని అనిపిస్తుంది. కానీ అలా నటించడానికి, నవ్వించడానికి చేసే కృషి అంత సులువు కాదు. ప్రతీ రంగంలోనూ కష్టపడితేనే విజయం వరిస్తుంది. కష్టం లేకుండా విజయం అంత సులువుగా రాదు. అయితే ఇష్టపడిన రంగంలో సక్సెస్ అయితే వచ్చే కిక్కే వేరు. కానీ ఇష్టపడిన వృత్తిలో నిలబడాలంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. ఆ అవమానాలను దాటుకుని వచ్చిన వారికే అందరి అభిమానాలు దక్కుతాయి.
ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అవమానాలు ఎక్కువ. హీరో అవుతానని వెళ్తే.. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని అంటారు. నీకెందుకురా పో అని గెంటేస్తారు. అలా గెంటివేయబడ్డ హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. సరిగ్గా ఇలాంటి అవమానమే నటుడు, హాస్యనటుడు ప్రియదర్శి జీవితంలో జరిగింది. ప్రియదర్శి.. ప్రియదర్శి పులికొండ గురించి తెలియని సినీ ప్రేమికులు ఉండరు. హాస్యంతో అందరినీ కడుపుబ్బా నవ్వించగలరు, ఉద్వేగభరిత నటనతో కంటి నిండా నీళ్లు తెప్పించగలరు. పెళ్లి చూపులు సినిమాతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. అతి తక్కువ సమయంలోనే హాస్య నటుడిగా, నటుడిగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు.
పెళ్లి చూపులు సినిమాలో ఒక సన్నివేశంలో.. ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. ‘నా చావు నేను చస్తా’ అనే పుస్తకం రాస్తున్నా అని అంటారు. ఆ ఒక్క డైలాగ్ తో ప్రియదర్శి ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించారు. హాస్యనటుడిగానే కాకుండా నటుడిగా కూడా తానేంటో నిరూపించుకున్నారు. మల్లేశం సినిమాలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా తన హవా చూపిస్తున్నారు ఈ మల్లేశం. లూజర్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, అన్ హియర్డ్ వెబ్ సిరీస్ లలో నటించారు. లూజర్ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి యాక్టింగ్ బాగుంటుంది.
పెళ్లి చూపులు సినిమాలో ఉత్తమ హాస్యనటుడిగా సైమా, ఐఫా అవార్డులు వరించాయి. ప్రస్తుతం ప్రియదర్శి కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుంది. అయితే ఇంత సక్సెస్ రావడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రియదర్శి. ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడల్లా నల్లగా, సన్నగా ఉన్నాడని, మొహం మీద మొటిమలు ఎక్కువ ఉన్నాయని తనని అవమానించేవారని ప్రియదర్శి అన్నారు. కొన్ని సార్లు హీరో కంటే పొడుగ్గా ఉన్నాడని అనేవారని, ఆ సమయంలో తనను తాను ప్రోత్సహించుకునేవాడినని ప్రియదర్శి అన్నారు. అలా అవమానాలను, విమర్శలను సైతం పాజిటివ్ గా తీసుకుని విజయానికి మెట్లుగా ఉపయోగించుకున్నారు ప్రియదర్శి.
— Indian Social Media (@NagarjunaWriter) October 25, 2022