ప్రముఖ నటుడు అలీ కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తోటి నటుల పట్ల ఎంత కలివిడిగా ఉంటారో తెలిసిందే. శుభకార్యమైనా, విశేషమైన, వేడుకైనా, పండుగైనా సరే అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. అందరితోనూ చక్కగా కలిసి పోతూ ఉంటారు. నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడు అలీకి, చిరంజీవి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నటుడు అలీ కూడా చిరంజీవితో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు చిరంజీవిని ప్రత్యేకంగా కలుస్తుంటారు. చిరంజీవి కూడా సహ నటులను కుటుంబ సమేతంగా ఇంటికి పిలిచి విందు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని నటుడు అలీ కుటుంబ సభ్యులతో కలిశారు.
అలీ, అలీ సతీమణి, అలీ సోదరుడు ఖయ్యూం అలీ, ఖయ్యూం సతీమణి, వారి పిల్లలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను అలీ సంతోషంగా జరుపుకోవాలని.. అల్లా దీవెనలు అలీ కుటుంబంపై ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో కలిసి పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అలీ అన్నారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సమస్త మానవాళికి మానవ సేవ చేయాలన్న సందేశాన్ని అందిస్తుందని అలీ అన్నారు. ప్రస్తుతం అలీ కుటుంబ సభ్యులు చిరంజీవిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.