పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘ సినిమా టీమ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విడుదల కానున్న RRR సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ప్రజలకు భారం లేకుండా.. నిర్మాతలకు నష్టం రాకుండా.. స్క్రూటినీ చేసి టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అని తెలిపారు. మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
సినిమా నిర్మాణం కోసం 336 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు RRR టీమ్ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీవోలో సినిమా షూటింగ్ 20 శాతం ఏపీలో జరిగితేనే సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. అయితే RRR షూటింగ్ జీఓ విడుదలకు ముందు జరిగింది కనుక.. మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న RRR సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మరి పెద్ద బడ్జెట్ సినిమాకి సీఎం జగన్ మద్దతు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.