తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుముశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై కొన్నేళ్ల పాటు రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. జమున మృతితో కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ సత్యభామ ఇకలేరని వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్పించారు. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు జమున మృతిపై తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. జమున మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు.
గతంలో జమున నటించి సినిమాలను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనలయ్యారు. అల్లరిపిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమమైన ఇల్లాలిగా, అన్నిటికి మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతగానో మెప్పించారని బాలయ్య అన్నారు. ఆమె బాల్యం నుంచి నాటకాల్లో అనుభవం ఉండటంతో నటనకే ఆమె ఆభరణంగా మారారని తెలిపారు. ఇంకా జమున గురించి బాలకృష్ణ మాట్లాడుతూ..” జమున గారు 195 పైగా సినిమాలలో నటించి.. తన నవరస నటనా సామర్ధ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా, పలు హిందీ చిత్రాలో సైతం నటించి ఔరా అనిపించారు. అలా తనదైన నటనతో అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. ఆమె భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. జమున గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని బాలకృష్ణ అన్నారు
మెగాస్టార్ చిరంజీవి సైతం జమున మృతిపై ఎమోషన్ ట్వీట్ చేశారు. సీనియర్ నటి జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరమని ఆయన అన్నారు. మాతృభాష కన్నడం అయినప్పటికీ ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశారని చిరు పేర్కొన్నారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పదని మెగాస్టార్ అన్నారు. ఆవిడ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ చిరు ఎమోషనలయ్యారు. జమున మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్ణయుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటితరం నటీమణుల్లో అగ్రకథానాయకిగా వెలుగొందిన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న జమున గారి మృతి బాధాకరమన్నారు.
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023
జమున కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున మృతిపట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. జమున గారు దివంగతులు కావడం బాధకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాటి తరానికి ప్రతినిధిగా జమున ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. వెండితెరపై విభిన్న పాత్రలో పోషించిన జమున గారు.. తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారని అన్నారు. జమున కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023