మీకు సినిమా హాల్లో వాట్సాప్, ఇన్ స్టా స్టేటస్ ల కోసం ఫోన్లల్లో సినిమా క్లిప్పింగులను వీడియో తీసే అలవాటుందా? అయితే మీకు శిక్షతో పాటు జరిమానా తప్పదు. సినిమా పైరసీకి పాల్పడే వారికి షాకిస్తూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది.
సినిమాలు వ్యయంతో కూడుకున్న పని. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా అనుకున్న స్ధాయిలో విజయం సాధించలేకపోతే నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సినీ నిర్మాతలు తమ ఆస్తులను పోగొట్టుకుని అత్యంత దయనీయమైన పరిస్థితికి చేరిన సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అయితే ఎప్పట్నుంచో సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న భూతం పైరసీ. సినిమా విడుదలైన కొద్ది సమయంలోనే పైరసీకి తెరలేపుతున్నారు కొందరు వ్యక్తులు. దీంతో సినీ నిర్మాతలకు, ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. తాజాగా పైరసీకి పాల్పడే వ్యక్తులకు షాకిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాటోగ్రఫి బిల్లులో పలు సవరణలు చేసింది. ఆ వివరాలు మీకోసం..
ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న నేపథ్యంలో పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫి సవరణ బిల్ 2023ను ప్రవేశపెట్టారు. లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్ ను కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఇక్కడ కూడా బిల్ పాస్ అయ్యింది. 1984 తర్వాత సినిమాటోగ్రఫి బిల్లులో మొదటి పెద్ద సవరణ ఇది. ఇక ఈ బిల్ లో పైరసీ అరికట్టేందుకు, సెన్సార్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా సవరించిన సినిమాటోగ్రఫి సవరణ బిల్ 2023 ప్రకారం ఇకపై సినిమాను పైరసీ చేసినా, థియేటర్స్ లో వాట్సాప్ స్టేటస్ ల కోసం మొబైల్స్ తో గానీ, కెమరాతో గానీ రికార్డ్ చేసేవారికి జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా విధించనున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి పైరసీకి పాల్పడే వారికి మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా నిర్మాణం కోసం అయిన ఖర్చులో 5 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇంటర్నెట్ లో అనధికార సినిమా వీడియోలను ప్రసారం కాకుండా నిరోధించడమే ఈ బిల్ ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రి తెలిపారు. దీంతో పాటు సెన్సార్ బోర్డ్ ఇస్తున్న సర్టిఫికెట్స్ లో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు సెన్సార్ బోర్డు నుంచి క్లీన్.. యూ, యూ/ఏ, ఏ సర్టిఫికెట్స్ మాత్రమే ఇస్తుండగా.. తాజాగా యూ/ఏ, ఎస్ లో మరో మూడు సర్టిఫికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అవి యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ సర్టిఫికెట్స్. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పైరసీ చేసేవారికి కళ్లెం వేసినట్లయ్యిందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.