తారలు ప్రేమలో పడటం మామూలే. అయితే దీన్ని అంత సులువుగా బయటపెట్టరు. కొందరు మాత్రం బోల్డ్‌గా తాము ప్రేమలో ఉన్నామని చెబుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్, పోస్టుల ద్వారా తమ రిలేషన్షిప్ గురించి హింట్ ఇస్తూ ఉంటారు.
సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగే విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం వారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. మూవీ సెలబ్రిటీలకు సంబంధించిన లవ్ గాసిప్స్, రూమర్స్ సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు చిత్రా శుక్లా. రాత్రికి రాత్రే ఆమె హీరోయిన్ అయిపోలేదు. అందం ఉన్నా, నటించే ప్రతిభ, డ్యాన్సులతో ఆకట్టుకునే టాలెంట్ ఉన్నా చిత్రా శుక్లాను అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. 2014లో ‘చల్ భాగ్’ అనే హిందీ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. అందులో ‘మేడమ్ జీ’ అనే పాటలో డ్యాన్సర్లలో ఒకరిగా కనిపించింది. అలా పలు చిత్రాల్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేసిన తర్వాత ‘మా అబ్బాయి’ అనే మూవీతో 2016లో టాలీవుడ్‌కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
‘మా అబ్బాయి’ చిత్రం తర్వాత ‘జానీ’ అనే కన్నడ ఫిల్మ్‌లో నటించింది చిత్రా శుక్లా. అనంతరం పలు సినిమాల్లో నటించినప్పటికీ ‘పక్కా కమర్షియల్’, ‘హంట్’ ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘కాదల్’, ‘నా నా’ అనే తమిళ సినిమాల్లో చిత్ర నటిస్తోంది. అయితే హఠాత్తుగా ఆమె ప్రేమ వ్యవహారం బయటపడింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్‌తో చిత్ర ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా వైభవ్ తన ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. చిత్రను స్వీట్హార్ట్ అని సంబోధిస్తూ క్యాప్షన్ పెట్టిన వైభవ్.. తన పోస్ట్ చివర్లో లవ్ సింబల్ జత చేశాడు. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నది నిజమేనని అందరూ అంటున్నారు. త్వరలో చిత్ర-వైభవ్ పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనిపై వీళ్లు అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.