టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైందంటే చాలు.. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ఎందుకంటే.. మెగాస్టార్ సినిమా అంటే సెలబ్రేషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఇటీవల ఆచార్య సినిమాతో డిజాస్టర్ ని చవిచూసిన చిరు.. ఇప్పుడు దసరా సందర్భంగా అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మలయాళం ‘లూసిఫర్’ నుండి రీమేక్ చేయబడింది. ఈ మెగా రీమేక్ మూవీని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరి జగన్నాథ్ కీలకపాత్రలు పోషించారు. అయితే.. ఆచార్య సినిమాతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు.. లూసిఫర్ మూవీ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండేసరికి గాడ్ ఫాదర్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కానీ.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయన్ లాంటి స్టార్ కాస్ట్ నటించేసరికి సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. దీంతో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. గాడ్ ఫాదర్ థియేట్రికల్ రైట్స్ నైజాంలో 22 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లు, ఆంధ్రా అన్ని ఏరియాలు కలిపి 35 కోట్లు.. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలలో 70.50 కోట్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది. కర్ణాటకలో 6.50 కోట్లు.. హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా 6.50 కోట్లు.. ఓవర్సీస్ 7.5 కోట్లు.. ఇలా వరల్డ్ వైడ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ దాదాపు 91 కోట్ల వరకు జరిగింది. ఇక ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లుగా సెట్ అయినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉన్నా, గాడ్ ఫాదర్ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సుమారు 57 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. అలాగే సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా మొత్తంగా అన్ని హక్కులు మంచి ధరకు అమ్మినట్లు సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో!