ప్రముఖ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి హజారయి..కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు మరణం తర్వాత ఆ స్థాయిలో బరవుబాధ్యతలు తన భుజాలపై వేసుకొని మెగాస్టార్ చిరంజీవి మోస్తున్నట్లు తెలిసిందే.
ఇప్పటికే ఆయన సినీ ఇండస్ట్రీ గురించి ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇటీవల కరోనా కష్టకలాలంలో సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి కూడా లేక అలమటించిపోతున్న సమయంలో వారందరికీ ఆపద్బాంధవుడు అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా చారిటబుల్ ట్రస్ట్ సీసీసీ తో చిరంజీవి గత ఏడాది సినిమా కార్మికులను ఆదుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ బాగా పడిపోయిందని, 20 శాతం ఉంటుందని అన్నారు.
ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా సక్సెస్ బాటలో నడుస్తుందని నమ్మకం ఉండదని.. ఏవో కొన్ని సినిమాలు ఆడితే ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉందని అనుకోరాదని పేర్కొన్నారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే గానీ ఢొక్కాడనివాళ్లు ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. ఒక్క ఐదారుగురు హీరోలో, ఐదారుగురు నిర్మాతలో, ఐదారుగురు దర్శకులో బాగున్నంత మాత్రాన సినిమా పరిశ్రమ మొత్తం బాగుందని కాదు. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుందని అన్నారు. కరోనా సమయంలో షూటింగులు నాలుగైదు నెలలు ఆగిపోయే సరికి చిత్ర పరిశ్రమ దుస్థితి సుస్పష్టమైంది. ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే తప్ప డొక్కాడని చాలామంది కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. గత ఏడాది హీరోలు, సినీరంగ పెద్దలతో కలసి నిధి సేకరణ చేసి నిత్యావసర వస్తువులు నాలుగు నెలల పాటు అందించాం. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, షూటింగ్స్ లేకపోతే కార్మికులు పడిన ఇబ్బందులు తెలియాలని.
వరదలు, భూకంపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది సాయం అందించేది మా చిత్ర పరిశ్రమే. ఈ విషయాన్ని నేను గర్వంగా చెపుతున్నాను. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. ‘లవ్‌స్టోరి’ వేదికగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలనూ వినమ్రంగా అడుగుతున్నాను.. కొంచెం సానుకూలంగా స్పందించి, మా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం అంటూ విజ్ఞప్తి చేశారు. వంకాయలు, బీరకాయల వంటి వాటిని మనం చూసి కొంటాం, కానీ కొన్న తర్వాత చూసేది సినిమా మాత్రమే. సినిమా ఎందుకు చూస్తారంటే మా మీద నమ్మకం.
అందుకే ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ప్రేక్షకులను అలరించాలని కోరుకునే మా సాధకబాధకాలపై మీరు కొంచెం దృష్టి సారించి, ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలి. మేం ఆశతో అడగడం లేదు. అవసరానికి అడుగుతున్నాం. మీరు ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం. లేకపోతే సినిమాలు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతాం అని చిరంజీవి ఆవేదన వెలిబుచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ చిన్న కష్టమొచ్చినా తన నెత్తిన వేసుకొని తనవంతు కృషిగా ముందుకు సాగుతన్నారు మెగాస్టార్ చిరంజీవి.