సినిమా అంటే.. మూడు పాటలు, ఆరు ఫైట్లు, రెండు జోకులు.. అనుకుంటారు కొందరు. కానీ సినిమాకు అర్థం ఇదికాదు. సినిమా అంటే సమకాలీన సమాజానికి ప్రతిబింబం.. ఓ దర్శకుడి ఆలోచనలకు ప్రతిరూపం.. భవిష్యత్ ఆచరణలకు ఆదర్శం. గ్రహించాలే గానీ ఒక్కో సినిమాలో ఒక్కో.. మంచితనం ఉంటుంది. ఇక వెండితెరపై వెలుగుతున్న అందరి కథానాయకుల జీవితాలు వెండివెలుగులు నింపుకున్న జీవితాలు కావు. అలాంటి కథానాయకులు తెరపైకి రాకముందు రంగస్థలంపై పడ్డ కష్టాలను ‘రంగమార్తాండ’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ వాయిస్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఓ నటుడి జీవితాన్ని తన మాటల్లో ఆవిష్కరించారు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఎమోషనల్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ఎవరెస్ట్. ఆయన సాధించని రికార్డులూ లేవు.. కొల్లగొట్టని హృదయాలూ లేవు. నా అన్నవాళ్లకు చేతి సాయమే కాకుండా.. మాట సాయం కూడా చేసి అందరి చేత అన్నయ్య అనిపించుకుంటారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా టాలీవుడ్ క్రీయేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’. రంగస్థల నటుల జీవితాలు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించబోతున్నారు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ కవితాఝరిని చిరంజీవితో చెప్పించారు డైరెక్టర్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాటల్లోనే తన నట విశ్వరూపాన్ని చూపారు మెగాస్టార్.
“నేనొక నటుడ్ని.. కష్టాలను కడుపులో పెట్టుకుని, మెుఖంపై చిరునవ్వు నింపుకునే.. నేనొక నటుడ్ని..” అంటూ ఓ భారీ మాటల తూటాల ప్రహహాన్ని ప్రవహింప చేశారు మెగాస్టార్. ఈ సంద్భంగా అక్కడక్కడ ఎమోషన్ అయ్యారు చిరంజీవి. ఇది ఈ మాటలు చెప్పేటప్పుడు నా జీవితం, నా కళ్ల ముందు మెదిలింది అని చెప్పుకొచ్చారు మెగాస్టార్. గతంలో కృష్ణవంశి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేశాడు. అప్పటి నుంచి మెగాస్టార్ మధ్య కృష్ణవంశీ మధ్య అనుబంధం పెరిగింది. అక్కడి నుంచి రంగమార్తాండ వీడియో వరకు వారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇక రంగమార్తాండా సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి కూడా ఓ పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ఇక రంగస్థల నటుల జీవితాలపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.