భగవంతునికి అన్ని రంగాల్లోనూ భక్తులు ఉంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధనవంతులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు, రాజకీయ నటులు, గొప్ప గొప్ప వ్యక్తులకు భగవంతుడి పట్ల విపరీతమైన భక్తి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఏ పండగొచ్చినా, భగవంతుడికి సంబంధించి ఏ శుభకార్యం జరిగినా.. అక్కడ ప్రముఖులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలడం మనం చూస్తున్నాం. సినిమా నటులు సైతం దేవుని పట్ల తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెగా ఫ్యామిలీ వారికి అయ్యప్ప స్వామి అంటే ప్రత్యేకమైన ప్రీతి అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్ వంటి వారు అయ్యప్ప స్వామి మాలలు వేసి తమ భక్తిని చాటుకుంటూ వస్తున్నారు. కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప దీక్ష తీసుకుంటారు స్వాములు. మాలలు ధరించి భక్తి శ్రద్ధలతో, నిష్టగా ఉంటారు. అయితే స్వాములంతా కలిసి అయ్యప్ప స్వామి వారికి పడిపూజ చేస్తారు. ప్రతీ గ్రామంలోనూ, ప్రతీ నగరంలోనూ పడిపూజలు నిర్వహిస్తారు. ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ మహా పడిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తుల సమక్షంలో అయ్యప్ప నామస్మరణ, అయ్యప్ప భజన పాటలు, భక్తి గీతాలతో మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వాములు, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.