మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే కాదు తన సేవా గుణంతోనూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆయన తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ వస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు, ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రజానీకంలోనూ ఫుల్ క్రేజ్, పాపులారిటీ ఉంది. ఆయన్ను ఆరాధించే వారు, ప్రేమించే వారు కోట్లాది మంది ఉన్నారు. దీనికి చిరు చేసిన సినిమాలే కాదు.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సినిమాలు ఆ తర్వాత రాజకీయాలు, ఇప్పుడు మళ్లీ మూవీస్తో ఎంత బిజీగా ఉన్నా మెగాస్టార్ సేవా కార్యక్రమాలను ఆపలేదు. కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచినంత సాయం చేస్తూ వస్తున్నారు. ఆయన దాన గుణం మరోమారు బయటపడింది. తాను చదువుకున్న వైఎన్ కాలేజీకి చిరు ఎంపీగా ఉన్న టైమ్లో రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టాలీవుడ్ దిగ్గజాలు దాసరి నారాయణ రావు, కృష్ణంరాజు, చిరంజీవితో పాటు దర్శకుడు ధవళ సత్యం, గజల్ స్రీనివాస్, గీత రచయిత అనంత్ శ్రీరామ్ కూడా వైఎన్ కాలేజీలోనే చదువుకున్నారని సత్యనారాయణ తెలిపారు. ఈ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలోనే దాసరి, చిరు డ్రామాలు వేసేవారన్నారు. కాలేజీ డెవలప్మెంట్ కోసం చిరంజీవిని అడగగానే ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారని సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన వైఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో చిరంజీవి పాల్గొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు చిరు మాట్లాడుతూ.. ఈసారి ఎంపీ నిధుల నుంచి ఇచ్చానని.. నెక్స్ట్ టైమ్ సొంత నిధులు ఇస్తానన్నారని సత్యనారాయణ వివరించారు. కాలేజీ అభివృద్ధికి దాసరి నారాయణరావు కూడా ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు, కృష్ణంరాజు కూడా రూ.10 లక్షలు ఇచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు.