తెలుగు సినీ పరిశ్రమలో అత్యద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో అపురూప చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్.. గురువారం కన్నుమూశారు. ఆయన మృతి తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తమ ఇద్దరి మధ్య తండ్రి-కొడుకుల బంధం ఉంది అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు చిరంజీవి. విశ్వనాథ్ లాంటి దర్శకుడి ప్రేమను పొందడం తనకు లభించడం గొప్ప వరంగా భావిస్తారు చిరంజీవి. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి మూడు చిత్రాల్లో నటించారు. శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భంధవుడు. ఈ మూడు చిత్రాల్లో చిరంజీవి నట విశ్వరూపం చూశాం. ఈ క్రమంలో విశ్వనాథ్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు చిరంజీవి.
‘‘దర్శకుడు విశ్వనాథ్, మిమ్మల్ని చూస్తే తండ్రికొడుకుల బంధం గుర్తుకు వస్తుంది. ఆయనతో మీకంత బాడింగ్ ఎలా’’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ‘‘విశ్వనాథ్ గారితో నాది తండ్రి-కొడుకుల బంధం వంటిది. నేను ఆయన దగ్గరకు వెళ్తే సరెండర్ అవుతాను. నాకు ఆయన ప్రేమ లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఆయన కూడా నన్ను కొడుకులా చూసుకునేవారు. నాపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనంగా ఓ సంఘటన చోటు చేసుకుంది’’ అన్నారు చిరంజీవి.
‘‘విశ్వనాథ్ గారు నన్ను ఓ నటుడిలానే కాక.. బిడ్డలా ప్రేమిస్తారు విశ్వనాథ్ గారు. తమిళనాడు కంచి టెంపుల్‌లో స్వయంకృషి సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పటికే నేను డైట్‌లో ఉన్నాను. షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వగానే నేను భోజనం చేయకుండా వెళ్లి పడుకున్నాను. అది గమనించిన విశ్వనాథ్ గారు చిరంజీవి ఏడి.. ఎక్కడ అని అడిగారు. సెట్‌లో ఉన్న వాళ్లు.. ఆయన మధ్యాహ్నం భోజనం చేయరండి.. అని చెప్పారు. అప్పుడు విశ్వనాథ్ బిడ్డ అలా ఆకలితో, అలసిపోయి ఉంటే నేను ఎలా పని చేయించుకోగలను.. అని చెప్పి.. ఆయనే స్వయంగా పెరుగన్నం కలిపి.. ఏడిద నాగేశ్వరరావుని పిలిచి ఆయనకు ఇచ్చారు’’ అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
‘‘అప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు ఆయన తినరండి అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ గారు.. నేను కలిపి ఇచ్చాను అని చెప్పు తింటాడు అన్నాడు. ఏడిద నాగేశ్వరరావు వచ్చి.. నన్ను లేపాడు. నేను రెడీనా అంటే.. అప్పుడు నాగేశ్వరరావు.. పెరుగన్నం నాకు అందించాడు. నేను తినను అంటే.. అప్పుడు ఆయన విశ్వనాథ్ స్వయంగా కలిపి ఇచ్చారు అని చెప్పాడు. ఆ మాటతో నేను కదిలిపోయాను. వెంటనే వెళ్లి ఆయనను కౌగిలించుకున్నాను’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘అప్పుడు విశ్వనాథ్ గారు.. ఏమయ్యా.. తిను.. బాగా ఎక్సర్‌సైజ్ చేయ్ అన్నాడు. అంతేకాక ఇలా కడుపు మాడ్చుకోకు అన్నారు. ఆరోజు నేను ఆయనను కౌగిలించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యానో.. ఇప్పటికి అలానే ఫీలవుతాను. ఆయన ప్రేమ దొరకడం నా అదృష్టం’’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. మరి చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.