‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’గా మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే ప్రకటించారు. అయితే.. తాజాగా, మెగాస్టార్.. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించారు. ఈ సందర్బంగా మెగాస్టార్ వేదికపైనే భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ వేడుకకు సతీసమేతంగా హాజరైన మెగాస్టార్.. ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అనురాగ్ ఠాకూర్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఈ స్థాయికి రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే అని చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు తనకు శివ శంకర వరప్రసాద్‌గా జన్మనిస్తే.. చిత్ర పరిశ్రమ చిరంజీవిగా జన్మనిచ్చిందన్నారు. “ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోను. నేను ఎప్పుడు మీతోనే ఉంటా. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కుడున్నా వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా”.
“గతంలోనూ నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని బాధపడ్డా. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది అనిపిస్తోంది. నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్ వరప్రసాద్ అనే నాకు .. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు విరామం వచ్చింది. పాలిటిక్స్ లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం..” అని చెప్పుకొచ్చారు.