చిరంజీవి తాజాగా ఓ ఖరీదైన కారును కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ పనుల కోసం ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. కారు కోసం తీసుకున్న ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా భారీ మొత్తం ఖర్చు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 40 ఏళ్లకు పైనే అవుతోంది. ఈ 40 ఏళ్లలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లు సృష్టించిన సినిమాలు చేశారు. దాదాపు 30 ఏళ్లుగా తెలుగులో నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం వాల్తేరు వీరయ్యలో వింటేజ్ చిరంజీవి కనిపించారు. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను ఓ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక, చిరంజీవికి కార్లంటే చాలా ఇష్టం ఆయన షెడ్‌లో రకరకలా కార్ల కలెక్షన్ ఉంది. ఆయన తాజాగా కూడా ఓ కారు కొన్నారు. ఖరీదైన ఆ కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం భారీగా ఖర్చు చేశారు.
వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కొద్దిరోజుల క్రితం టయోట వెల్‌ఫైర్ అనే ఖరీదైన కారును కొన్నారు. నలుపు రంగులో ఉన్న ఈ కారు ధర అక్షరాలా 1.19 కోట్ల రూపాయలు. ఈ కారు రిజిస్ట్రేషన్ పనులకు సంబంధించి చిరు తాజాగా, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. వాహన రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ సంతకం చేయించాల్సి ఉండగా ఆయన అక్కడకు వెళ్లారు. కొణిదెల చిరంజీవి అన్న పేరుతో ఆ కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ కారుకు టీఎస్09జీబీ1111 అన్న నెంబర్ తీసుకున్నారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరు భారీగానే ఖర్చు చేశారు.
ఏకంగా 4.7 లక్షలు రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, రష్మీ గౌతమ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న సినిమా థియేటర్లలోకి రానుంది. మరి, టీఎస్09జీబీ1111 అన్న ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరంజీవి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.