సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు మామూలే. హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకే కాదు.. వారి అభిమానులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంబంధించి ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంట్ గురించి ప్రేక్షకుల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎంత నమ్ముతారనేది తెలిసిందే. దాదాపుగా అన్ని సినిమాలను శుక్రవారమే రిలీజ్ చేస్తారు. ఒక మూవీ మొదలుపెట్టే ముహూర్తానికి కొబ్బరి కాయ కొట్టే దగ్గర నుంచి పూర్తయినప్పుడు గుమ్మడి కాయ కొట్టేంత వరకు సెంటిమెంట్లను పాటిస్తుంటారు. కాంబినేషన్లు, విడుదల తేదీలు.. ఇలా చాలా వాటిల్లో సెంటిమెంట్లను పాటించడం సర్వసాధారణమని చెప్పొచ్చు. అలాంటి సెంటిమెంట్లు నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లకే కాదు.. ఫ్యాన్స్‌లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తమ హీరో ఫలానా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తే హిట్ పక్కా లేదా ఫలానా గెటప్‌లో మూవీ చేస్తే సూపర్ హిట్ అంటుండటాన్ని చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక సెంటిమెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న ఆయన.. పక్కా ప్లానింగ్, క్రమశిక్షణతో వేగంగా వాటిని పూర్తి చేస్తున్నారు. కమ్ బ్యాక్‌లో హిట్ లేక సతమతం అయిన చిరు.. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. పూనకాలు లోడింగ్ అంటూ తన డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషన్స్‌తో థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించారు. ఈ మూవీ తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళాశంకర్’ చిత్రం షూటింగ్లో చిరు బిజీగా ఉన్నారు. మేడే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘భోళా శంకర్’ కొత్త పోస్టర్లో చిరంజీవి లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పసుపు రంగు ట్యాక్సీలో డ్రైవర్ వేషధారణలో స్టైలిష్‌గా కూర్చుని చిరు టీ తాగుతున్న లుక్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. వైరల్‌గా మారిన ఈ పోస్టర్‌ను చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాస్ మరోసారి డ్రైవర్ పాత్రలో కనిపించడంతో వాళ్లు తెగ హ్యాపీ ఫీలవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. చిరంజీవి ఇంతకుముందు రెండు సినిమాల్లో డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. అందులో ఒకటి గ్యాంగ్ లీడర్ కాగా.. ఇంకొకటి ఇంద్ర మూవీ కావడం విశేషం. ఈ రెండు చిత్రాల్లో డ్రైవర్ రోల్స్‌లో పసందైన ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకున్నారు చిరు. ఈ ఇరు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్ క్యారెక్టర్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందని.. ‘భోళా శంకర్’ కూడా మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.