“నేటి సమాజం వృద్ధ యువకులతో నిండిపోయింది” అన్నాడో కవి. అవును నిజమే.. నాలుగు అడుగులు వేస్తే ఆయసం.. పరిగెడితే పడిపోవడం. ఇలాంటి వారిని వృద్ధులు అనకుంటే యోధులు అంటారా? ఇక మనలాంటి వారికోసమే శ్రీశ్రీ మాటల తూటాలు వదిలాడు. “లే కుదిరితే పరిగెత్తు .. వీలైతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో! అంతే కానీ ఎక్కడా ఆగకు” అంటూ. ఇలాంటి మాటలు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, వెంటనే ఎదో చెయ్యాలని ఆరాటపడతాం. ఆ తర్వాత ఐదు నిమిషాలకే చల్లబడతాం. ఇక మనం చేసే పనిగురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కొద్దిసేపు పనిచేయగానే.. తలనొప్పి.. బాడీ పెయిన్స్ అంటూ సాకులు చెప్తు పనిని పాతర పెట్టేస్తాం. అలాంటిది సినిమా పరిశ్రమలో 60 సంవత్సరాలు నిండినా గానీ ఇంకా యువకుల్లాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ. వాళ్లను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు అంటారా? అయితే ఈ క్రింది విషయాలను పూర్తిగా చదవండి.
ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒక్కడే.. మరో మెగాస్టార్ ఇండస్ట్రీకి రాడు. ఈ మాట అనడంలో ఎలాంటి గర్వంలేదు.. గౌరవం తప్ప. ఈ విషయం మనందరికి తెలుసు. ఎందుకంటే ఆయన చెయ్యని పాత్రలూ లేవు.. ఎక్కని శిఖరాలూ లేవూ. ఇక ఒక విత్తనాన్ని ఎవరైనా నాటితే అది, ఇంతై వటుడింతై మహా వృక్షం లాగా ఎదుగుతుంది. కానీ ఒక విత్తనం తనకు తానే విత్తుకుని, ఓ మహా వృక్షంగా మారడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలా తనకు తానే విత్తుకుని కళామతల్లి ఒడిలో మహా వృక్షంగా ఎదిగారు మెగాస్టార్. ఇక తాను ఎదగడంతో పాటు పది మంది ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తూ.. ఛారిటీలు ఏర్పాటు చేసి అభిమానుల బుుణం తీర్చుకుంటున్నారు మెగాస్టార్.
ఇక డబ్బు విషయం అంటారా? తరాలు కూర్చుని తిన్నా తరగతి డబ్బు సంపాదించారు.. అంతకంటే ఎక్కువ అభిమానుల ప్రేమను కొల్లగొట్టారు. మరి అలాంటి చిరంజీవికి 60 సంవత్సరాలు వచ్చినా కష్టపడాల్సిన అవసరం ఏముంది? డూప్ లేకుండా ఫైట్స్ చేయాల్సిన గత్యంతరం ఏముంది? సింగరేణి గనుల్లో అస్వస్థతకు గురికావాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ వయసులో యంగ్ హీరోలతో పోటా పోటీగా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది? ఆయనకు ఉన్నదల్లా ఒక్కటే.. మనిషి ఎప్పుడు నిత్య విద్యార్థిలా సాధన చేసుకుంటూ పోతుండాలి. అందుకే ఆయన జీవితం ఇప్పటి యువతరానికి ఆదర్శం.. ఆచరణీయం.
నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్ లో మాస్ హీరో అంటే బాలయ్య అనే చెప్పాలి. ఏ మాస్ హీరోకు లేని ఫాలోయింగ్ ఒక్క బాలకృష్ణకే ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ.. తనదైన నటనతో అభిమానులను అలరిస్తున్నారు. అగ్ర కథానాయకుడి కుమారుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ ముద్రను ఏ కోశానా తనపై పడకుండా, తన నటనతో స్టార్ గా ఎదిగారు. ఇక బాలకృష్ణ డ్యాన్స్ చూస్తే.. యువ హీరోలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జెలసీగా ఫీల్ అవుతారు. ఇక ఇప్పుడు 60వ పడిలోకి అడుగుపెడుతున్న బాలయ్య.. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాలను మార్చగల బాలయ్య ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నాడు? బహుశా మనలాంటి తెలివి ఆయనకు లేకనే కాబోలు. అదే ఉంటే ఆయన ఇప్పటికి ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యేవారేమో.
ఇక పుట్టుకతోనే గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన ఆయనకు 60 సంవత్సరాల ఏజ్ లో సినిమాలు చేయడం నిజంగా కావాలంటారా? మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా.. మరో మాజీ ముఖ్యమంత్రి బావగా, ఎమ్మెల్యేగా.. ఇంతటి పేరు ప్రతిష్టలు ఉన్న బాలయ్య ఈ వయసులో ఇంకా వర్క్ ఎందుకు చేస్తున్నట్లు. చిన్న పనులకే ఎవరెస్ట్ శిఖరాన్ని మోసినట్లు ఫీలయ్యే మనం.. 20 సంవత్సరాలకే వృద్ధాప్యంలోకి వెళ్తున్నాం. మరోవైపు 60 సంవత్సరాల నిండిన మెగాస్టార్, బాలయ్యలు యువకులతో పోటీపడి మరి సినిమాలు పూర్తిచేస్తున్నారు. నిజంగా వారిని చూస్తే సిగ్గేస్తుంది. వారిలా మనమెందుకు ముందుకు సాగటం లేదని! వారికేంటండి అన్నీ ఉన్నాయి అని మీరు అనొచ్చు. అవును అన్నీ ఉన్నాయి.. కానీ ఇంకా కష్టపడి సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటారు? ఒక్కసారి ఆలోచించండి.. కావాల్సినంత డబ్బు, సాధించాల్సిన కీర్తి ప్రతిష్టలు.. అన్నీ ఉన్నాయి అయినా వారు ఇంకా కష్టపడుతున్నారు. అన్ని ఉన్నవారే అలా షష్టి పూర్తి ఏజ్ లో కూడా కష్టపడుతుంటే.. మనం మాత్రం యువకులుగా ఉన్నప్పుడే సోమరులుగా మారిపోతున్నాం.
మరో విషయం మెగాస్టార్, బాలకృష్ణలు వరుసగా 10 సినిమాలు హిట్ కొడితే.. ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ క్రేజ్ పెరగదు. ఒకవేళ 10 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయినా గానీ వారి క్రేజ్ తగ్గదు. అయినా వారు తమపని తాము చేసుకుంటూ పోతున్నారు. వీరిద్దరి కంటే వయసుపైబడిన ఎంతో మంది ఇప్పటికీ రాణిస్తున్నవారు ఉన్నారు నేను కాదనను. ఇక ఈ మధ్య కాలంలో వస్తున్న యువ హీరోలు సైతం కొన్ని సినిమాలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలతో పాటుగా.. మేము వృద్ధ యువకులము కాము అనుకునే వారందరు.. ఇకనైనా మెగాస్టార్, బాలకృష్ణ లాంటి మరికొందరిని చూసైనా ముందుకు కదులుతారని ఆశిద్దాం.