సింగర్ చిన్మయి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జాకెట్లు వేసుకోకపోవడమే మన దేశ సంస్కృతి అని చిన్మయి అన్నారు.
సింగర్ చిన్మయి గురించి తెలిసిందే. గాయనిగా ఎంత ఫేమసో, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఆమె అంతే పాపులర్. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఎన్నో సినిమాల్లో ఆమె పాత్రకు చిన్మయి గాత్రం అందించారు. కెరీర్ విషయాన్ని పక్కనబెడితే.. ప్రతి విషయంలోనూ పక్కాగా ఉంటారామె. ఏ అంశం మీదనైనా బోల్డ్‌గా స్పందిస్తారు. అందుకే ఆమె వ్యాఖ్యలు ఎక్కువగా వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా మరోసారి చిన్మయి సంచలన కామెంట్స్ చేశారు. డ్రెస్‌ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని బాధపడిపోతూ ఒక యువకుడు ఓ వీడియో షేర్ చేశాడు. వాళ్లు ఎలాగూ వేసుకోవడం లేదు కాబట్టి.. తాను వేసుకుంటానని వీడియోలో చెప్పుకొచ్చాడు. దీనిపై తనదైన శైలిలో స్పందించారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలని చిన్మయి అన్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్‌ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు. అప్పటివరకు అసలు జాకెట్లు వేసుకునేవారు కాదని.. చీరను జాకెట్‌గా మడిచి ధరించేవారని పేర్కొన్నారు. చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోవాలని చిన్మయి పేర్కొన్నారు. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. స్త్రీలను బ్లౌజ్ లేకుండా చూస్తే వాళ్లకు కలిగిన లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారని చిన్మయి వివరించారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదన్నారు. బ్లౌజ్ బ్రిటిష్ కల్చని అని చెప్పారు. విజ్ఞానం పెంచుకోవాలని, కామంతో ప్రతిదాన్ని చూడొద్దని చిన్మయి వ్యాఖ్యానించారు.