యూత్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సందడి చేస్తోంది.
సౌత్ సినిమాలు అంటే ఇక్కడి ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ఆడియెన్స్ కూడా తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రాలకు, హీరోలకు అక్కడ ఒక రేంజ్లో పాపులారిటీ ఉంది. టాలీవుడ్ మూవీస్‌లో ఉండే ఎమోషన్స్, యాక్షన్‌ను వాళ్లు బాగా ఇష్టపడుతున్నారు. అందుకే తెలుగు సినిమాలు వరుసబెట్టి బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. ‘బాహుబలి’ నుంచి ‘కార్తికేయ’ వరకు మన చిత్రాలకు అక్కడ మంచి ఆదరణ, భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ఉత్తరాదిన క్రేజ్ ఉన్న తెలుగు హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు నేరుగా అక్కడ రిలీజ్ కాకపోయినా.. అనువాదమై యూట్యూబ్, టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘జయ జయ జానకి’ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో హయ్యెస్ట్ వ్యూస్‌తో సంచనాలు సృష్టించింది. దీంతో బాలీవుడ్ మార్కెట్‌పై కన్నేసిన ఈ యంగ్ హీరో.. అక్కడో చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ రూపొందిస్తున్న ఈ ఫిల్మ్‌తో బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. చాలా మటుకు సీన్లు మక్కీకి మక్కీ ఒరిజినల్ నుంచి దింపేశారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ట్రైలర్లో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు కాపీ పేస్ట్ చేసేశారని చెప్పొచ్చు.
ఫైట్ సీన్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటెన్సిటీ మాత్రం బాగుంది. ఒంటిచేత్తో విలన్ గ్యాంగ్‌ను ఊచకోత కోస్తున్న సీన్స్ మంచి అటెన్షన్ తీసుకున్నాయి. ఫైట్లు బాగా చేస్తాడనే పేరును ఆయన కాపాడుకున్నాడు. ఒరిజినల్ ‘ఛత్రపతి’లో ఫైట్ల కంటే కూడా ఎమోషన్, మదర్ సెంటిమెంట్ హైలైట్ అయింది. కానీ రీమేక్ ట్రైలర్లో అది సరిగ్గా సెట్ అవ్వలేదనిపిస్తోంది. తల్లి పాత్రలో నటించిన భాగ్యశ్రీకి బెల్లంకొండకు మధ్య ఎమోషన్స్ పండనట్లే కనిపిస్తోంది. అలాగే బెల్లంకొండకు జంటగా నటించిన నుష్రత్ భరూచా కూడా సెట్ అవ్వలేదు. ట్రైలర్లో బెల్లంకొండ డైలాగుల కంటే ఫైట్లే ఎక్కువయ్యాయి. దీంతో అదేదో డబ్బింగ్ సినిమా ట్రైలర్ మాదిరిగా అనిపించింది. మరి.. ట్రైలర్లో కంటే సినిమా ఏమైనా భిన్నంగా ఉంటుందేమో చూడాలి. ఎమోషన్స్, తల్లి సెంటిమెంట్ పండితే మాత్రం హిందీలోనూ ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు.