ప్రముఖ నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. జసెఫిన్ ఎవరో కాదు.. యావత్ ప్రపంచాన్ని తన నటనతో నవ్వించిన లెజెండరీ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రముఖ నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. జసెఫిన్ ఎవరో కాదు.. యావత్ ప్రపంచాన్ని తన నటనతో నవ్వించిన లెజెండరీ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె. కాగా ఆమె మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం.. జూలై 13న పారిస్‌లో జోసెఫిన్ చాప్లిన్ మరణించారని పేర్కొన్నారు.
మృతికి గల కారణాలను వెల్లడించలేదు. సుమారు 10 రోజుల క్రితమే ఆమె చనిపోతే, ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జోసెఫిన్ చాప్లిన్ 1949 మార్చి 28న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జన్మించారు. చాప్లిన్ ఎనిమిది సంతానంలో మూడో వ్యక్తి జోసెఫిన్. తండ్రి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన ‘లైమ్ లైట్’ (1952) మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారామె. హాలీవుడ్‌లో ‘ది కాంటర్‌బరీ టేల్స్’, ‘ఎస్కేప్ టు ది సన్, ‘ది బే బాయ్’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.
చివరిగా 1994లో ‘డౌన్ టౌన్ హీట్’ లో కనిపించారు. పలు టెలివిజన్ సిరీస్‌లోనూ కనిపించారు. 1969లో నికోలస్ సిస్టోవారిస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 1977లో విడాకులు తీసుకున్నారు. 1989లో జీన్ క్లూడ్ గార్డెన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2013లో ఆయన అనారోగ్యంతో మరణించారు. జోసెఫన్ చాప్లిన్‌కు జూలియన్ రోనెట్, జూలీ, ఆర్థర్ అనే ముగ్గురు కుమారులున్నారు.