టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. గతేడాది ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారారు. ఆహా ఓటిటిలో ప్రసారమైన ఈ షో.. మొదటి సీజన్ లోనే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా బెస్ట్ టాక్ షోలలో ఒకటి టాప్ రేటింగ్ దక్కించుకుంది. అయితే.. ఈ ఏడాది దసరా, దీపావళి సందర్భంగా అన్ స్టాపబుల్ రెండో సీజన్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 14న ‘అన్ స్టాపబుల్ 2’ షో మొదలైంది. ఇక 2వ సీజన్ ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా ప్రారంభించారు.
ఇటీవలే బాలయ్య, చంద్రబాబు నాయుడుల ‘అన్ స్టాపబుల్ 2’ ఎపిసోడ్ ట్రైలర్ చూసినప్పుడే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. నందమూరి ఫ్యామిలీతో అనుబంధం, ఆయన రాజకీయ జీవితం, తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, 1995లో తాను తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు స్పందించారు. ఈ షోలో బాలయ్య హోస్ట్ అయినప్పటికీ, చంద్రబాబును ఆప్యాయంగా బావ అని పిలుస్తూ షోని కొనసాగించారు. ఈ క్రమంలో బాలయ్య.. మీ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఏంటని అడిగాడు.
చంద్రబాబు స్పందిస్తూ.. “ఒక్కోసారి జీవితంలో ఎన్నో చేస్తుంటాం. అలా 1995లో తీసుకున్న నిర్ణయం. ఆరోజు ఏ విధంగా చేశామనేది ఆలోచించినప్పుడు.. ఎన్టీఆర్ ఏదైతే ఒక పార్టీ పెట్టి.. పోరాడి.. ఒక ఆశయ సాధన కోసం ఆయన ముందుకెళ్లారు. ఎలక్షన్స్ జరిగి ఒక ఐదారు నెలలు అయ్యింది. అంతకుముందు కూడా మన ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు ఎమ్మెల్యేలంతా తిరగబడ్డారు. ఐదుగురు మాత్రమే ఆ నిర్ణయం వెనుక సాక్ష్యులు. ఆయన దగ్గరికి నేను, మీరు, హరికృష్ణ గారు.. అక్కడే బీవీ మోహన్ రెడ్డి, పెద్దాయన ఉన్నారు. లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు.. ఫ్యామిలీ గురించి అయితే ముగ్గురు మాట్లాడండి, రాజకీయమైతే నన్ను ఒక్కడినే మాట్లాడమన్నారు.
మీరు బయట కూర్చున్నారు. మూడు గంటలు నేను లోపల ఆయనతో మాట్లాడాను. చాలా రిక్వెస్ట్ చేశా.. ఆర్గ్యుమెంట్ చెప్పా.. ఒక మీటింగ్ పెట్టమన్నాను. నా వినండి అని కాళ్ళు కూడా పట్టుకొని అడుక్కున్నా.. మీకొక్క మాట మాట్లాడి ఎమ్మెల్యేలను కన్సోల్ చేయమని చెప్పా. బయటికి వచ్చాక రాముడు, ఆంజనేయుడు.. రామాంజనేయ యుద్ధమే జరిగింది. రామబాట ముఖ్యమని ఆంజనేయుడు తిరుగుబాటు చేసి ముందుకెళ్లడం చరిత్ర. నేను అందుకే ఆరోజు నిర్ణయం అనేది.. ఎన్టీఆర్ తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్ట. కానీ.. ఆయన వ్యక్తిగా కంటే.. సిద్ధాంతాలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆ మీటింగ్ లో ముగ్గురు లేరు. మీరొక్కరే ఉన్నారు.. ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? మీరే చెప్పాలి.” అని చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య.. నాన్నగారిలో ఆ టైంలో నాయకుడికంటే పర్సనల్ ఎమోషన్స్ పెరిగిపోయాయని అనుకుంటున్నట్లు చెప్పాడు. చూడాలి మరి ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో..!