తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని దుఖఃం మిగిలిందనే చెప్పాలి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు చలపతి రావు(78) ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో మణియ్య, వీయమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢాచారి 116 తో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చలపతిరావు ఎక్కువగా నెగిటీవ్ పాత్రల్లో నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత తండ్రి, తాతయ్య లాంటి పాజిటీవ్ పాత్రల్లో నటించి మెప్పించారు. చలపతిరావు 1200 పైగా చిత్రాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించారు. అలనాటి దిగ్గజన నటుడు ఎన్టీఆర్ మొదలు కొని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. దాదాపు మూడు తరాల నటులతో ఆయన నటించి మెప్పించారు.
ఇండస్ట్రీలో చలపతిరావు ఎంత నెగిటీవ్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఎంతో సౌమ్యంగా ఉంటారని.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనను బాబాయ్ అని పిలుస్తారు. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కి ఎంతో నమ్మకమైన వ్యక్తుల్లో చలపతిరావు ఒకరు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఇబ్బందులు పడ్డా.. ఆయన ఎంతో ఆదరించి ఛాన్సులు ఇప్పించారని వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుత చిత్రం ‘దానవీర శూరకర్ణ ’. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి భారీ వసూళ్లు చేసింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో చలపతిరావు ఇంద్రుడు, జలాసంధురుడు, అతిరథుడు పాత్రల్లో నటించారు. అయితే మరో రెండు గెస్ట్ రోల్స్ లో కూడా నటించారు చలపతిరావు. మొదట దానవీర శూరకర్ణ చిత్రంలో ఇంద్రుడిగా తీసుకున్నప్పటికీ తర్వాత మరికొన్ని పాత్రల్లో నటించే అవకాశం ఇచ్చారట ఎన్టీఆర్. అలాగే మరో రెండు గెస్ట్ రోల్స్ లో కూడా నటించాల్సిన అవసరం రావడంతో తననే నటించాలని ఎన్టీఆర్ కోరవడంతో నటించానని అన్నారు. అలా ఒకే చిత్రంలో ఏకంగా ఐదు పాత్రల్లో నటించి అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేశారు చలపతిరావు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.