సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. వారి ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు సోమవారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్రపరిశ్రమ మూగబోయింది. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించారు. అటల బిహరీ వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బీజేపీ నాయకులతో కృష్ణంరాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. పలువురు భాజపా నాయకులు కృష్ణంరాజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు.
దివంగత సినీ నటుడు , కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె. లక్ష్మణ్ లతో కలసి ఆయన కృష్ణం రాజు నివాసానికి వెళ్లారు. అక్కడ కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు ప్రభాస్ ను పరామర్శించారు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో రాజ్ నాథ్ సింగ్ కి ఎంపీ లక్ష్మణ్ వివరించారు. కృష్ణం రాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు. ఇప్పటికే కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం పట్ల చింతిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయుకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. కొందరు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. తాజాగా కేంద్రం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు పరామర్శించారు.