సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. చివరిదశకు వచ్చేసింది. సెమీస్ లో అద్భుతమైన విజయం సాధించిన తెలుగు వారియర్స్.. కప్ కోసం భోజ్ పురి జట్టుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయింది.
క్రికెట్.. ఎక్కడైనా సరే క్రికెట్. టీమిండియా ఆటగాళ్లు ఆడినా.. తెలుగు హీరోలు ఆడినా సరే ఎంటర్ టైన్ మెంట్ మాత్రం అస్సలు మిస్ కాదు. భారత జట్టు మ్యాచులు అనగానే కోహ్లీ, రోహిత్ శర్మ గురించి అందరూ మ్యాచులు చూస్తారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)లో తెలుగు వారియర్స్ మ్యాచ్ ఉందంటే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆటని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్టింగ్ లో మంచిగా ఎంటర్ టైన్ చేసే ఇతడు.. ఇప్పుడు మన జట్టుని ఫైనల్ కి తీసుకెళ్లిపోయాడు. తాజాగా జరిగిన మ్యాచులో ఒంటిచేత్తో క్లాస్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నిరోజుల నుంచి సీసీఎల్ జరుగుతోంది. ఇందులో తెలుగు వారియర్స్ జట్టు బాగానే ఆడుతోంది. తాజాగా శుక్రవారం వైజాగ్ స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కన్నడ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన తెలుగు జట్టు.. 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. దీంతో నాలుగు పరుగుల ఆధిక్యంలో కర్ణాటక జట్టు నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి కన్నడ జట్టు 98 పరుగులు చేసింది. అనంతరం తెలుగు వారియర్స్ 103 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లు పూర్తి కాకముందే ఛేదించారు. రెండో ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేసిన తమన్.. ధనాధన్ ఆటతో ధోనీని గుర్తుచేశాడు. బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టి వావ్ అనిపించాడు.
శుక్రవారమే జరిగిన మరో సెమీఫైనల్ ముంబయి హీరోస్ పై భోజ్ పుర్ దబంగ్స్ అద్భుత విజయం సాధించింది. దీంతో శనివారం జరిగే ఫైనల్లో తెలుగు వారియర్స్-భోజ్ పురి దబంగ్స్.. కప్ కోసం పోటీపడనున్నాయి. ఇదిలా ఉండగా కొవిడ్ కారణంగా మూడేళ్లు వాయిదా పడిన సీసీఎల్.. రీలోడెడ్ పేరుతో ఈ ఏడాది రీ లాంచ్ చేశారు. 8 జట్లతో ఫిబ్రవరి 18న కొత్త సీజన్ ప్రారంభమైంది. ఇందులో ప్రతి జట్టు ఓ మ్యాచ్ లో 10 ఓవర్లు చొప్పున రెండు ఇన్నింగ్స్ లు ఆడుతూ వచ్చింది. అలా సీజన్ ఆసాంతం కేక పుట్టించే ప్రదర్శన చేసిన తెలుగు వారియర్స్ ఫైనల్లో అడుగుపెట్టేసింది. ఇదే ఊపులో కప్ కూడా కొట్టేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అలానే తమన్ బ్యాటింగ్ కి ఫిదా అయిపోతున్నారు. మరి తెలుగు వారియర్స్.. సీసీఎల్ ఫైనల్లో అడుగుపెట్టడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.