ప్రముఖ తమిళ హీరో గౌతమ్ కార్తిక్, బహు భాషా నటి మంజిమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని తాజాగా ఇద్దరూ ధ్రువీకరించారు. తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తాము ప్రేమించుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈనెల 28న వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని వీరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. శుక్రవారం కార్తిక్, మంజిమలు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము నవంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమైన అతి కొద్దిమంది బంధు, మిత్రుల మధ్య సింపుల్‌గా ఈ పెళ్లి జరగబోతోందని చెప్పారు.
అది కూడా చెన్నైలోనే జరగబోతున్నట్లు తెలిపారు. పెళ్లి ఫొటోలను వీలైనంత త్వరగా మీడియాకు విడుదల చేస్తామని అన్నారు. మొదట తానే మంజిమకు ప్రపోజ్ చేశానని, ఆమె రెండు రోజుల తర్వాత ఓకే చెప్పిందని గౌతమ్ అన్నాడు. దేవరాట్ట సినిమా టైంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేదని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడు. రెండు కుటుంబాల మద్దతుతోనే పెళ్లి జరుగుతున్నట్లు వెల్లడించాడు. నేను వీక్‌గా మారిన ప్రతీసారి ఆమె నన్ను మోటివేట్ చేస్తుందని అన్నాడు. అవకాశం వస్తే భవిష్యత్తులో ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పాడు.
మీరు పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తారా? అన్న రిపోర్టర్ ప్రశ్నకు మంజిమా మోహన్ సమాధానం ఇస్తూ.. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. చివరగా ఓ రిపోర్టర్ గౌతమ్ కార్తిక్‌ను కులం గురించి ఓ ప్రశ్న అడిగారు. ‘‘ గౌతమ్ సార్! మీ నాన్న(ప్రముఖ సీనియర్ హీరో కార్తిక్) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరిట ఓ పార్టీ నడుపుతున్నారు. మీరు దేవర్ కులానికి చెందిన వాళ్లు. ఆమె కేరళకు చెందిన అమ్మాయి. మరి మీ ఇంట్లో ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు గౌతమ్ సమాధానం ఇస్తూ.. ‘‘ దానికి దీనికి సంబంధం ఏంటి సార్’’ అని సమాధానం ఇచ్చాడు.