మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. మనకు ఉన్నంతలో వారికి అతిథి మర్యాదలు చేస్తాం. అదే కొత్తగా పెళ్లైన దంపతులు వస్తే వారికి పసుపు-కుంకుమ, గాజులు, పూలు, కుదిరితే చీర పెట్టి ఆశీర్వదించి పంపుతాం. అదే గర్భవతి అయిన బంధువు మన ఇంటికి వచ్చినా.. మనం వారిని చూడ్డానికి వెళ్లినా ఉత్త చేతులతో వెళ్లం. పండో, ఫలమో తీసుకెళ్తాం. మనకు చేతనైనంతలో ఇంటికి వచ్చిన బంధువులను ఆదరంగా చూస్తాం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో అతిథి దేవో భవ అన్నారు. ఇలాంటి ఆచారవ్యవహారాలను పాటించడంలో మన తెలుగు వారు ఓ అడుగు ముందుంటారు. ఆఖరికి షూటింగ్‌లకు వేరే ఇండస్ట్రీ వారు ఎవరైనా గెస్ట్‌లుగా వచ్చినా సరే.. వారిని తగు విధంగా సత్కరించడం మనకు అలవాటు. గతంలో శాతకర్ణ షూటింగ్ సమయంలో బాలకృష్ణ హేమమాలినికి చీర పెట్టి సత్కరించిన సంగతి తెలిసిందే.
ఇలా మర్యాదలు చేసే విషయంలో మన వాళ్లా, వేరే ఇండస్ట్రీ, పక్క రాష్ట్రం వాళ్లా అంటూ ఇలా బేధాలు చూపడం తెలుగు వారికి తెలియదు. అతిథులను ఆత్మీయంగా సత్కరించడం మాత్రమే మనకు తెలుసు. ప్రతి ఒక్కరిని ఆదరించడం మన సంప్రదాయం. తాజాగా క్యాష్ వేదిక సెట్స్ మీద మరోసారి ఇది రుజువయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్‌లో భాగంగా బ్రహ్మాస్త్ర చిత్రం బృందం రణ్‌బీర్, ఆలియా భట్, మౌనిరాయ్, దర్శకధీరుడు జక్కన్న క్యాష్ ప్రొగ్రామ్‌లో సందడి చేశారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఎప్పటిలానే యాంకర్ సుమ.. వచ్చిన గెస్ట్‌లతో సరదాగా చిట్‌చాట్ చేసి.. ఫన్నీ కామెంట్స్, పంచ్‌లతో షోను రక్తికట్టించింది. ఇక ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమ.. ఆలియాకు సారె పెట్టి ఆశీర్వదించింది. బొట్టు పెట్టి.. చీర, గాజులు, పసుపు-కుంకుమ, పండ్లు ఇచ్చి ఆశీర్వదించింది. ప్రసుత్తం ఈ ప్రోమో తెగ వైరలవ్వగా.. సుమ చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు వారి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం.. అందరిని గౌరవిస్తాం.. ఆదరిస్తాం.. మనం ఎవరితో శత్రు భావం పెంచుకోం. సుమక్క ఈ చిన్న పనితో మన గొప్పతనాన్ని చాటారు.. హ్యాట్సాఫ్ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.