పుష్ప సినిమాలో ఇంటి పేరు ఏంటి అని అడిగినప్పుడు పుష్ప చాలా బాధపడుతుంటాడు. అయితే పుట్టుకతో వచ్చేది కాదు, మనకి మనం సొంతంగా సెట్ చేసుకునేదే అసలైన అడ్రస్, అసలైన బ్రాండ్ అని అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నిరూపించారు. నిజమే ఇంటి పేరు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దానికొక బ్రాండ్ వేల్యూ కొందరే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. అల్లు అనే పేరుకి ఒక బ్రాండ్ ని తీసుకొచ్చారు. హాస్య నటుడిగా అల్లు రామలింగయ్య ‘అల్లు’ అనే పేరుకి ఒక బ్రాండ్ ని సెట్ చేస్తే.. ఆయన కొడుకు అరవింద్ నిర్మాతగా మారి ఆ బ్రాండ్ విలువను మరింత పెంచారు. ఇక హాస్యనటుడి మనవడిగా, నిర్మాత కొడుకుగా ఉన్న అల్లు అర్జున్ మాత్రం.. అల్లు అనే పదానికే ఒక శోభ తీసుకొచ్చారు. ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లారు.
పుష్ప సినిమాలో క్లైమాక్స్ మాదిరి అల్లు అనే బ్రాండ్ నేమ్ ని శిఖరం అంత ఎత్తుకి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ వెల్లడించారు. ఆలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఖచ్చితంగా బన్నీకి బిగ్గెస్ట్ మైల్ స్టోన్ పుష్ప సినిమానే. అయితే తనకి ఎందుకు మైల్ స్టోన్ అంటే.. నేషనల్ స్టార్ అవ్వడం తనకి కూడా మైల్ స్టోన్ అని చెప్పుకొచ్చారు. ఇక అలీ ఒక ప్రశ్న అడిగారు. “సపోజ్ మీ నాన్న గారు (అల్లు రామలింగయ్య) సడన్ గా కనిపించారనుకోండి ఏం చెప్తారు” అని అలీ ప్రశ్నించారు. దానికి అల్లు అరవింద్.. “ఆయనకి అల్లు అంటే చాలా ఇష్టం. నేను ప్రయత్నించి చాలా దూరం తీసుకెళ్ళాను. ఇప్పుడు నీ మనవళ్లకిచ్చాను. వాళ్ళు ఇంకా ఎత్తుకి తీసుకెళ్తున్నారు అని చెబుదామనిపిస్తుంది” అంటూ సమాధానమిచ్చారు.
నిర్మాతగా అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా అల్లు అనే బ్రాండ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లారు. యమకింకరుడు, హీరో, విజేత, పసివాడి ప్రాణం, మాస్టర్, గంగోత్రి, జల్సా, మగధీర, ధృవ, గీతా గోవిందం ఇలా అనేక హిట్ చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈయన వారసులుగా వచ్చిన అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు.. ఆ అల్లు అనే పేరుని ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్మాతగా వెంకటేష్, హీరోలుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు రామలింగయ్యకి ఇష్టమైన పని చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన ఆలీతో సరదాగా షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.