కైలాష్ ఖేర్.. ఈ సింగర్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. ఎన్నో మైమర్చిపోయే హిట్ సాంగ్స్‌తో సినీ సంగీత అభిమానుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. హిందీతో పాటు దక్షిణాదిలోనూ సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కైలాశ్ ఖేర్. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల చిత్రాల్లోనూ ఆయన పాటలు పాడటం విశేషం. అయితే ఆయనకు పేరు తీసుకొచ్చింది మాత్రం ‘పండగలా దిగివొచ్చావు’ సాంగ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మిర్చి’లోని ఈ పాటను కైలాష్ పాడిన తీరుకు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులూ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగులో కైలాష్ ఖేర్ పేరు మారుమోగిపోయింది. ఆయనకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ‘పరుగు’, ‘భరత్ అనే నేను’, ‘గోపాల గోపాల’ చిత్రాల్లో కైలాష్ పాటలు ఆలపించారు. ‘బాహుబలి’ హిందీ, తమిళ వెర్షన్లలోనూ ఆయన సాంగ్స్ పాడారు. అలాంటి కైలాష్ ఖేర్‌పై దాడి జరగడం సంచలనంగా మారింది.
కర్ణాటకలో ‘హంపీ ఉత్సవ్’లో పాల్గొన్న కైలాష్ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మీద దాడి జరిగింది. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు కైలాష్‌పై వాటర్ బాటిల్స్ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ఏటా నిర్వహించే ‘హంపి ఉత్సవాలు’ ఈసారి కూడా ఘనంగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. పలువురు కళాకారులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో జనాలను అలరించారు. ఈ కార్యక్రమంలో కైలాష్ ఖేర్ కూడా పాల్గొన్నారు. ఆయన పలు హిందీ పాటలు ఆలపించారు. అయితే, తమకు కన్నడ సాంగ్స్ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు స్టేజీ మీద ఉన్న కైలాష్ ఖేర్ మీదకు నీళ్ల సీసాలు విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ కంగుతిన్నారు. సమాచారం తెలియగానే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.