హృతిక్‌తో జూ.ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ మేరకు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో ఈ సినిమా తెరపైకి రాబోతోంది. సూపర్ హిట్ విజయాన్ని సాధించిన వార్ సినిమాకు సీక్వెల్‌గా..
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్‌లు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సౌత్‌లో మల్టీస్టారర్‌ల హవా నడుస్తోంది. తాజాగా, వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మల్టీస్టారర్లు చేయటానికి.. ముఖ్యంగా సౌత్ స్టార్లతో చేయటానికి బాలీవుడ్ వాళ్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ భారీ మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో వచ్చిన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’లో ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమా పట్టలెక్కనుంది. ఈ సినిమా విడుదలైతే మటుకు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే, ఇక్కడ ఓ అనుమానం, బాధ సగటు సౌత్ ప్రేక్షకుడి మనుసును తొలిచి వేస్తోంది. అందేంటంటే..
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. సౌత్ సినిమాలను కేవలం ప్రాంతీయ సినిమాగా చూసేవారు. కొందరు బాలీవుడ్ ప్రముఖులు సౌత్ వారికి పెద్దగా వాల్యూ ఇచ్చేవారు కాదు. చాలా మంది సౌత్ నటులు, దర్శకులు బాలీవుడ్‌లో సినిమా తీయటానికి ఆసక్తి చూపేవారు. బాలీవుడ్ కూడా సౌత్ వారిని చిన్న చూపు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నటులు కూడా తాము సర్వోన్నతులం అన్న అహంతో ఉండేవారు. కానీ, రాజమౌళి పుణ్యమా అని బాలీవుడ్ గర్వం అణిగింది. హిందీ సినిమాతో ధీటుగా.. అంతకంటే గొప్పగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు సక్సెస్ సాధించటం మొదలెట్టాయి.
ఇదంతా ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా జరుగుతోంది అనటంతో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో పాటు చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన కార్తికేయ 2లతో బాలీవుడ్ వారిలో మార్పు వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ సాధించటంతో వారికి సౌత్ సినిమాల వాల్యూ ఏంటో.. రేంజ్ ఏంటో ఇప్పటికే అర్థం అయిపోయింది. దానికి తోడు బాలీవుడ్‌నుంచి వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగా నిలిచాయి. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సౌత్ సినిమాల వైపే మొగ్గారు. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ తన ఆలోచనా ధోరణిని మార్చుకుంది. సౌత్ హీరోలు తమ సినిమాల్లో ఉంటే చాలు సక్సెస్ సాధిస్తాము అనుకుంటోంది.
ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ వరల్డ్ యాక్టర్‌ను తక్కువ చేసి చూసే బుద్ధి తక్కువ పని బాలీవుడ్ చేయదనంటంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే హాలీవుడే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వారికి ఆహ్వానాలు ఇస్తున్న ఈ తరుణంలో తక్కువ చేసి చూడాలనే ఆలోచనే అస్సలు చేయదు. అందరికీ కాకపోయినా కొందరికైనా ‘‘వీళ్లు మేము సమానం కాదు’’ అని లోపల ఉన్నా.. బయట అలాంటి భావాలు కనిపించకుండా జాగ్రత్త పడతారు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకుడు కాబట్టి మన హీరోలకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.