కరోనా ఇండస్ట్రీని చిన్నాభిన్నం చేసింది. అనేక సినిమాలు మధ్యలో ఆగిపోయి.. నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా సరే.. ఎంత వరకు ప్రేక్షకులు వస్తారో అన్నది అనుమానంగానే ఉంది. గతంలోలా వందల కోట్ల కలెక్షన్ లు వస్తాయా రావా అని ఆందోళన చెందుతున్నారు మేకర్స్. దీంతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆసక్తికర కాంబినేషన్లను తెరపైకి తెస్తున్నారు.ఈ క్రమంలో కోలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది.
తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు లోకనాయకుడు కమల్ హాసన్, మరో హీరో అజిత్ తో కలిసి ఒక ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇద్దరూ ఇందులో దేశ రక్షణ కోసం పాటుపడే ఉద్యోగులుగా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి పాత్రలో నటించనుండగా.., అజిత్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరు పవర్‌హౌస్‌లు కలిస్తే ఏమవుతుందా అని అంతా ఇప్పటి నుంచే ఎగ్జయిట్ అవుతున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. కమల్ హాసన్ మురికివాడలో పెరిగిన ఆడ పిల్లను దత్తత తీసుకుంటాడట. అయితే ఆ ఆడపిల్ల ఉగ్రవాది అని తర్వాత తెలుస్తుంది. దీంతో.., కమల్ హాసన్ మీద అనుమానం వచ్చిన అజిత్ ఆయనను అరెస్టు చేస్తాడట. ఆ తర్వాత ఇన్విస్టిగేషన్ ఉత్కంఠగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఈ లైన్ లో సినిమా కనుక వస్తే నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి కలైపులి యస్ థాను నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.