గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ కు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ అవడం లేదు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో రీమేక్ చేరింది. అజయ్ దేవగణ్ 'భోళా'గా వచ్చాడు కానీ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది?
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే రీమేక్ అనేది సేఫ్ గేమ్. ఓ భాషలో హిట్టయిన మూవీని మరో భాషలో తీయడం అనేది చాలా ఏళ్ల నుంచి దాదాపు అన్నిచోట్లా జరుగుతున్నదే. కొందరు డైరెక్టర్స్ రీమేక్స్ నే దాదాపు అలానే తీస్తారు. మరికొందరు మాత్రం ప్రేక్షకుల్ని ఎక్స్ ట్రా ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామని అవసరమున్నా లేకపోయినా కొన్నింటిని జోడిస్తూ ఉంటారు. ఇవి సినిమాకు ప్లస్ అయితే పర్లేదు కానీ ఏ మాత్రం అతి అనిపించినా.. మొత్తం సినిమానే తేడా కొట్టేస్తుంది. ఇదంతా ఏ సినిమా కోసం చెబుతున్నానా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది? అక్కడికే వచ్చేస్తున్నా. నాని ‘దసరా’తో పాటు పాన్ ఇండియా రిలీజైన మరో మూవీ ‘భోళా’. ఇప్పుడు ఈ సినిమానే సినీ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్ని సినిమాలుంటాయి బాస్. వాటిని అస్సలు టచ్ చేయకూడదు. ఒకవేళ రీమేక్ చేసినా సోల్( కథలో కీలకమైన ఎమోషన్) మిస్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ అజయ్ దేవగణ్ మాత్రం నేల విడిచి సాము చేశాడు. కార్తి-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఖైదీ’. జైలు నుంచి రిలీజైన ఓ ఖైదీ, తప్పనిసరి పరిస్థితుల్లో 40 మంది పోలీసుల్ని కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు. చివరకు వాళ్లని సేవ్ చేశాడా లేదా అనేది స్టోరీ. ఓ రాత్రిలో జరిగే ఈ కథని అంతే రియలిస్టిక్ గా ఎలాంటి పక్కచూపులు లేకుండా తమిళంలో తీశారు. తెలుగులో డబ్ అయిన మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.
కానీ ‘ఖైదీ’ రీమేక్ హక్కుల్ని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ దక్కించుకున్నాడు. ‘భోళా’ పేరుతో సినిమా తీసి, తాజాగా మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కూడా చేశాడు. అయితే ‘ఖైదీ’ చూసి ఈ సినిమా చూసిన వాళ్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఒరిజినల్ లో కార్తి చేసే ప్రతి పని కూడా మనకు కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. హిందీలోకి వచ్చేసరికి అజయ్ దేవగణ్.. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అన్ని ఒక్కడే హ్యాండిల్ చేసేశాడు. ఏకంగా ఐదుగురు రైటర్స్ ని పెట్టుకుని స్టోరీలో చాలా మార్పులు చేసి పడేశాడు. బైక్ ఛేజింగ్ సీన్స్, చిరుతపులి, శూలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నదాని కంటే అతి చేశారు. దీంతో బాలీవుడ్ దెబ్బకు మరో సౌత్ సినిమా బలైపోయింది!
‘ఖైదీ’లో దిల్లీ పాత్రతో పాటు గాయపడిన మగ పోలీస్ ఉంటారు. దీన్ని ‘భోళా’లో లేడీ పోలీస్ గా మార్చేశారు. టబు ఆ రోల్ చేసింది. ఆమె చేతికి ఖరీదైన రెబాన్ కళ్లజోడు పెట్టుకుని, జీప్ ఓ పక్కన పట్టుకుని విలన్స్ ని షూట్ చేయడం కాస్త ఓవర్ ది టాప్ లా అనిపించింది. హీరో అజయ్ దేవగణ్ కు అయితే అవసరానికి మించి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పోయారు. బహుశా తానే డైరెక్టర్ అయ్యేసరికి.. కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు ఉన్నాడు. సినిమాలో మంచిగా వయలెన్స్ జరుగుతుంటే సడన్ గా కామెడీ బిట్ వస్తుంది. అది అయినా సరిగా ఉంది అనుకునే టైంలో మెలోడ్రామా సీన్, ఇది ఉందనుకునే టైంలో రొమాంటిక్ సీన్ వస్తుంది. ఇలా మొత్తంగా కలగాపులంగా చేసేయడంతో ‘ఖైదీ’ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అజయ్ దేవగణ్ కు నుదుట విభూతి, చేతిలో త్రిశూలం ఎందుకు అనేది క్లియర్ గా చెప్పలేకపోయారు.
‘భోళా’కు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా లౌడ్ అయిపోయింది. దీని వల్ల కొన్నికొన్ని డైలాగ్స్ కూడా సరిగా వినపడలేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘భోళా’ క్యారెక్టర్ వీడియో గేమ్ లో ప్రధాన పాత్రధారిలా అనిపించింది. ఎందుకంటే లెవల్ తర్వాత లెవల్.. విలన్లని చంపుకొంటూ వెళ్లడం కాస్త కామెడీగా అనిపించింది. విలన్స్ అయితే విచిత్రమైన గెటప్స్ లో కనిపించి ఆవాక్కయ్యేలా చేశారు. త్రీడీ ఎఫెక్ట్ అని అన్నారు గానీ అది సినిమాకు పెద్దగా అయితే ఉపయోగపడలేదనే చెప్పాలి. ఓ సీన్ లో అజయ్ దేవగణ్, విలన్ ని కొడతాడు. మహా అయితే ఏమవుతుంది రక్తం వస్తుంది కదా అని ఆడియెన్స్ అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి గుండె వెనక వైపు నుంచి బయటకొస్తుంది. ఇదెక్కడి లాజిక్ రా మావ అని నార్మల్ ఆడియెన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. వన్ నైట్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ‘ఖైదీ’ని కాస్త అజయ్ దేవగణ్ కిచిడీ చేసి పడేశాడు. ఈ మూవీ తొలిరోజు కేవలం రూ 11.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాని ‘దసరా’తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మరి మీలో ఎవరైనా ‘భోళా’ చూశారా? ఏమైనా చూస్తే ఎలా అనిపించింది కాస్త కింద కామెంట్ చేయండి.