బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలిసిందే. ఈ పండుగ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగు చిత్రాల్లో పలు పాటలు, ‘బతుకమ్మ’ పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బడా హిందీ మూవీలో ‘బతుకమ్మ’పై ఓ పాటను తెరకెక్కించారు. మిగిలిన వివరాలు..!
బతుకమ్మ పండుగ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. పువ్వుల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగగా బతుకమ్మను చెబుతారు. ఈ పండుగను తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక్కడి సంస్కృతిలో ఇదో భాగంగా మారిపోయింది. అయితే, ఉత్తరాదిలో బతుకమ్మ పండుగ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తెలంగాణతో అనుబంధం ఉన్నవారికి తప్ప, నార్త్‌లో ఈ ఫెస్టివల్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే.. ఒక బాలీవుడ్ బిగ్ మూవీలో బతుకమ్మ పాట ఉంది కాబట్టి!
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఈ సినిమాలో సల్లూభాయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి రానున్న ఈ ఫిల్మ్ నుంచి తాజాగా ఒక సాంగ్‌ను రిలీజ్ చేశారు. బతుకమ్మ విశిష్టతను చక్కగా తెలియజేసేలా ఉన్న ఆ సాంగ్‌ను ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డేతో పాటు భూమిక, రోహిణి హట్టంగడిని కూడా చూడొచ్చు. ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’లో బతుకమ్మ పాట పెట్టాల్సిందిగా వెంకటేష్ సలహా ఇచ్చారట.
వెంకీ ఇచ్చిన ఆ ఐడియా నచ్చడంతో మేకర్స్‌కు సల్లూభాయ్ స్పెషల్ సాంగ్ పెట్టాలని చెప్పారట. ఈ పాటను తెలంగాణలోని మహిళలకు అంకితం ఇస్తున్నట్లు సమాచారం. ఈ బతుకమ్మ పాటలో 200 మంది డ్యాన్సర్లు, సినిమాలోని ప్రధాన తారాగణం కనిపించి ఆకట్టుకున్నారు. పూజా హెగ్డే తన స్టెప్పులతో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా, ‘కిసీ కా భాయ్’లో మరో ప్రత్యేకత కూడా ఉందట. ఈ చిత్రంలోని ఓ పాటలో సల్మాన్, వెంకీ, పూజతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి డ్యాన్స్ చేశారట. ఈ పాటకు ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిచారని తెలుస్తోంది. చాన్నాళ్ల కిందటే ఈ పాటను పిక్చరైజ్ చేశారని సమాచారం. ‘కిసీ కా భాయ్’లో బతుకమ్మ సాంగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.