టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. భారీ గ్యాప్ తర్వాత ఈ ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో తదుపరి సినిమాలను కూడా లైనప్ చేసేశాడు. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేశాడు బాలయ్య. అయితే.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటిటి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
బాలయ్య హోస్ట్ గా తెలుగు OTT ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ నుండే ఎంతో ఉత్సాహంగా షోని విజయవంతంగా తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ‘అన్ స్టాపబుల్’ షోలో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని హాజరయ్యారు.
త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్యతో షోలో కనిపించనున్న విషయం విదితమే. రవితేజ, గోపిచంద్ ఎపిసోడ్ సంబంధించి ప్రోమోను వదిలిన ఆహా త్వరలోనే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే.. మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ ‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ముగియనుందట. త్వరలోనే మహేష్ ఎపిసోడ్ తో సీజన్ 1 ముగుస్తుందని తాజాగా ఆహా బృందం ప్రకటించింది. మరి బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.