టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పార్థివ దేహానికి బాలకృష్ణ నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం భార్య వసుంధర, కూతురు నారా బ్రాహ్మిణితో కలిసి బాలయ్య పద్మాలయ స్డూడియోస్‌కు వెళ్లారు. అక్కడ కృష్ణ కుటుంబసభ్యులను బాలయ్య కుటుంబసభ్యులు పరామర్శించారు. బాలయ్య మహేష్ బాబుకు ధైర్యం చెప్పి ఓదార్చారు. దాదాపు 10 నిమిషాలకు పైనే కృష్ణ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కృష్ణ మరణంతో ఏడుస్తున్న మహేష్, గౌతమ్‌లను బాలకృష్ణ నవ్వించారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, మహేష్‌ల మధ్య చక్కటి సంభాషణ జరిగింది. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ అంటూ ప్రశంసించారు.
ఆయన సినిమా రంగంలో సాహసాలకు, సంచలనాలకు మారు పేరని, చలన చిత్ర రంగానికి ఆయన ఎనలేని సేవలు చేశారని చెప్పారు. మొదటి కౌబాయ్ సినిమా.. మొదటి స్టీరియో స్కోప్ సినిమా.. మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా, మొదటి డీటీఎస్ సౌండ్ సిస్టమ్ సినిమాను పరిచయం చేసింది కృష్ణేనని అన్నారు. ఆయన నిర్మాతల పాలిట కల్ప తరువు, కల్ప వృక్షమని పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్, కృష్ణకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమా థియేటర్‌లో మొదటి ఆటకే చూడటానికి వెళ్లి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినటం గురించి కృష్ణ తనకు చెప్పేవారని అన్నారు. కృష్ణ నిర్మాతల కోసం ఎన్నో చేశారని, పారితోషికం తగ్గించుకున్నారని, ఆర్థికంగా కూడా సహాయం చేశారని చెప్పారు.
కాగా, సూపర్ స్టార్ కృష్ణ సోమవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆయన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కృష్ణ మరణించారు. ఉదయమే ఆయన భౌతిక దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఫ్యాన్స్ కోసం పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.