నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోల కంటే చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తున్నారు. సినిమాలు, షోలు అంటూ ఫ్యాన్స్ ని అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉండే బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. దీంతో బాలయ్యకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వైరల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణకు సంబంధించిన పెళ్లిపత్రిక ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 1982వ సంవత్సరం డిసెంబర్ 8న బాలకృష్ణ, వసుంధరా దేవి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలకృష్ణ సతీమణి తల్లిదండ్రులైన దేవరపల్లి సూర్యారావు, ప్రమీలా రాణి దంపతులు ఈ శుభలేఖను అచ్చు వేయించారు.
శుభలేఖలో వధువు మా ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరా దేవి, వరుడు భాగ్యనగరం వాస్తవ్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పంచమ పుత్రుడు చిరంజీవి బాలకృష్ణ అని అచ్చు వేయించారు. 08-12-1982 తేదీ బుధవారం పగలు 12.41 నిమిషాలకు సుముహూర్తం పెట్టినట్లుగా ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కర్ణాటక కళ్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది. విందు కూడా అదే రోజున ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకూ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8తో బాలకృష్ణ వివాహం జరిగి 40 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బాలకృష్ణ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి అనే సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.