నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమా ఫంక్షన్లకు తప్ప.. ఇతర హీరో మూవీ కార్యక్రమాలకు హాజరవ్వడం చాలా అరుదు. కానీ వచ్చారంటే.. మాత్రం.. రచ్చ రంబోలా చేస్తారు బాలయ్య. ఎంతో సరదాగా అందరిని ఆటపట్టిస్తూ.. పంచులు వేస్తూ.. కామెడీ చేస్తూ.. అందరిని ఎంటర్‌టైన్ చేస్తాడు బాలయ్య. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ట్రైరల్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు బాలయ్య. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ 1.0ను బాలయ్య లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడి.. ఆడియన్స్ చేత రచ్చ రంబోలా చేయించారు. విశ్వక్ సేన్‌పై పంచ్‌లు వేస్తూ, అతడిని ప్రశంసిస్తూ తన మాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలయ్య.
స్టేజీ మీదకు వెళ్లిన బాలయ్య.. యాంకర్ గీత నుంచి మైక్ అందుకుని.. దాన్ని గాలిలోకి గిరాగిరా ఎగరేసి పట్టుకున్నారు. ఈ సీన్‌తో అక్కడ గోల రెట్టింపు అయ్యింది. ఆ తర్వాత ‘‘అరే బయ్ మొత్తం నువ్వే మాట్లాడేసినవ్.. నేనేం మాట్లాడను’’ అంటూ తెలంగాణ యాసలో స్పీచ్ మొదలెట్టారు బాలయ్య. ‘సరస్వతీ నమస్తుభ్యం’ స్తోత్రాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పేశారు బాలయ్య. ఆ తర్వాత తాను ఈ శ్లోకం చెప్పడానికి కారణం వివరించారు బాలయ్య. విశ్వక్‌సేన్ నటిస్తోన్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమాను నిర్మిస్తోన్నది వన్మయే క్రియేషన్స్ బ్యానర్. వన్మయే అంటే సరస్వతి అని అర్థం.. అందుకే ఆ తల్లిని స్మరించుకున్నాను అన్నాడు బాలయ్య.
ఆ తరవాత బాలయ్య ట్రైలర్ గురించి మాట్లాడుతూ.. ‘నీ ఇంట్లో నా ఇంజిను’ అంటూ ట్రైలర్‌లో విశ్వక్ సేన్ చెప్పిన డైలాగు చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అరిచి రచ్చ రచ్చ చేశారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు గురించి మాట్లాడుతూ.. ‘‘తంబి విశ్వక్ సేన్ వాళ్ల నాన్న మాట్లాడినప్పుడు ఆయన ఎత్తుకోవడమే ధమ్కీ లాగ ఎత్తిండు. తరవాత మైకులు పనిచేయవేమో.. నేను మాట్లాడలేనేమో అనుకున్నా’’ అంటూ పంచ్ వేసేశారు.
ఆ తర్వాత విశ్వక్ సేన్‌ని ప్రశంసిస్తూ.. ‘‘సినిమా అంటే విశ్వక్‌కి చాలా ప్యాషన్. ఈ సినిమా చూస్తే విశ్వక్ ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు దాటి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని, కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు. విశ్వక్ సేన్ ఇప్పటికే.. ఫలక్‌నుమా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా ఇలా వైవిధ్యమైన సినిమాలతో అలరించి ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్. అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా వందరోజుల వేడుకకి కూడా నేను రావాలి’’ అన్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.