నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తాను కామెడీ చేశానని అన్నారు. అంతేకాదు! ఈ సినిమాను ఒకరకంగా ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ‘‘మంగమ్మ గారి మనవడు’’ సినిమా గురించి చర్చ మొదలైంది. బాలకృష్ణ అంతలా ఆకాశానికి ఎత్తేస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకోవటానికి ఆయన అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ ప్రత్యేకంగా చెప్పుకునేంత విషయం ‘‘మంగమ్మ గారి మనవడు’’ సినిమాలో ఏముంది? ఇంతకీ ఆ సినిమా సాధించిన విజయాలేంటి.
1980లలో చరిత్ర సృష్టించిన సినిమా
బాలకృష్ణ, హిట్ సినిమాల దర్శకుడు కోడి రామృకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘‘మంగమ్మ గారి మనవడు’’. ఈ కాలం వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, 1980లలో ఓ చరిత్ర సృష్టించిన సినిమా ఇది. ఈ సినిమా 1984లో విడుదలై సంచల విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో తెరకెక్కిన ‘మన్ వాసనై’కి రీమేక్‌గా ‘‘మంగమ్మ గారి మనవడు’’ తీయబడింది. ఈ సినిమాను చూస్తే రీమేక్ సినిమా అని అస్సలు అనిపించదు. దర్శకుడు కోడి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కథ మొత్తం తమ ఊర్లోనే జరిగింది అన్నట్లుగా ఎవరికి వాళ్లను భ్రమింపజేస్తుంది. రైటర్ గణేష్ పాత్రో డైలాగులు సినిమాకు ప్రాణం లాంటివి. ప్రధాన పాత్రల మధ్య జరిగే సంభాషణలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
మరుపు రాని పాత్రలు.. పాటలు
ఈ సినిమాలో పాత్రలు నిజ జీవితానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. మంగమ్మగా భానుమతి.. వీరన్నగా నందమూరి బాలకృష్ణ.. మల్లిగా సుహాసిని నటన నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. మిగిలిన పాత్రలు కూడా ప్రేక్షకుల్ని నేరుగా పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. ఇక, సినిమా పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికి కూడా ఎక్కడో ఓ చోట ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘‘ దంచవే మేనత్త కూతురా..’’.. ‘‘ శ్రీ సూర్య నారాయణ.. మేలుకో’’ పాటలు ఆల్‌టైమ్ హిట్ పాటలు.
రికార్డుల వర్షం.. బాలయ్య కెరీర్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ మూవీ..
ఈ సినిమా 1984 సెప్టెంబర్ 7న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా బాలకృష్ణ కెరీర్‌లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా కొన్ని చోట్ల సంవత్సరంపైనే ఆడింది. హైదరాబాద్‌లో 565 రోజులు ఆడింది. తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. 2006లో పోకిరి సినిమా వచ్చే వరకు ఈ సినిమాపైనే ఆల్‌టైమ్ రికార్డు ఉండేది. ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఆ తరం వారికి.. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ మరుపు రాని చిత్రమే.