ఇప్పుడు విలన్ అంటే.. హీరోను మించి స్టైలీష్‌గా ఉంటున్నాడు. కానీ 1990 కాలంలో వచ్చిన సినిమాల్లో విలన్ అంటే భారీ కాయంతో.. చూడగానే భయపడేలా ఉండాలి. అలా విలనిజం పండించిన ఓ నటుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడంటే..
సినిమాలో హీరో, విలన్, హీరోయిన్ ప్రధానం. తక్కిన వారంతా.. ఆయా పాత్రల పరిధి మేరకు వచ్చి పోతుంటారు. ఇక సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే.. హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతాడు. నేటి కాలంలో సినిమాల్లో విలన్ అంటే.. హీరోకు ధీటుగా, స్టైలీష్ లుక్‌లో.. సిక్స్‌ప్యాక్ బాడీతో.. కన్నీంగ్ ఐడియాలతో, స్మార్ట్ లుక్‌లో అదరగొడుతున్నారు. నేటి కాలంలో స్టైలీష్ విలన్‌లకే ఎక్కువ ప్రాధాన్యత. అందుకే ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన వారు, చిన్న హీరోలను విలన్ పాత్రల కోసం సెలక్ట్ చేసుకుంటున్నారు దర్శకులు. వీరు సైతం విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. కానీ ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల హవా నడుస్తున్న రోజులు. ఆయా చిత్రాల్లో విలన్ అంటే.. హీరోకు రెండింతల శరీరంతో.. ముఖం చూడగానే దడుసుకు చచ్చేలా ఉండేవారు. అలాంటి విలన్‌ను మన హీరో.. చితక్కొడుతుంటే.. ఆ ఫైట్ ఏదో మనమే చేస్తున్నట్లు సంబరపడేవాళ్లం. అలా 1990లో భీకరమైన విలనిజం పండించి.. గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మోహన్ రాజ్.
మోహన్ రాజ్ ఆ.. ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా.. ఒక్కసారి నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమా గుర్తుకు తెచ్చుకొండి. అందులో బాలకృష్ణనే ఢీకొట్టి భీకరమైన విలనిజం పండించిన విలన్ గుడివాడ రాయుడు గుర్తున్నాడా.. ఆయనే మోహన్ రాజ్. తెలుగులో లారీ డ్రైవర్, చినరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, శివమణి, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు మోహన్ రాజ్. మరి ఒకప్పుడు సౌత్‌లో విలన్ పాత్రలకు పెట్టింది పేరు అయిన మోహన్ రాజ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నారు.. ఆయన కుటుంబ నేపథ్యం వంటి ఆసక్తికర అంశాలు మీ కోసం…
మోహన్ రాజ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ చదివాడు. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో పదులకు పైగా చిత్రాల్లో నటించాడు. మలయాళ చిత్రం మొన్నం ములా చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తమిళంలో, తెలుగులో అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు. మలయాళంలో కొన్ని సీరియల్స్‌లో కూడా నటించాడు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం మధురైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషన్‌గా విధులు నిర్వహిస్తోన్నాడు.
మోహన్ రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు జైష్మ, కావియా సంతానం ఉన్నారు. ఇక మోహన్ రాజ్ ఆర్మీలో పని చేశాడు. ఆ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, కేరళ పోలీసు శాఖలో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగంలో చేరాడు. ప్రస్తుతం ఆ శాఖ కమిషనర్‌గా పని చేస్తున్నాడు మోహన్ రాజు. సినిమాలకు దూరంగా.. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ.. భార్యాబిడ్డలతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నాడు మోహన్ రాజ్. తెలుగులో నరసింహనాయుడు ఆయన నటించిన చివరి చిత్రం.