నందమూరి బాలకృష్ణ.. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చేశారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. థియేటర్లలో ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఇదే టైంలో బాలయ్య తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు… అయితే ఓ సందర్భంలో మాట్లాడుతూ.. దేవ బ్రహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే క్షమాపణలు చెప్పాలని దేవాంగుల కమ్యూనిటీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య స్పందించారు
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య తన వ్యాఖ్యలపై స్పందిస్తూ బహిరంగా లేఖని ఒకటి విడుదల చేశారు. తాను చేసిన కామెంట్స్ పై అందులో క్లారిటీ ఇచ్చారు. పొరపాటున అలా మాట్లాడాను అని, తనని మన్నించాలంటూ బాలయ్య అందులో పేర్కొన్నారు. దేవాంగుల నాయకుడు రావణబ్రహ్మ అని తాను అన్న మాటల వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానంటూ లేఖలో చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని స్పష్టతనిచ్చారు. ‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీసోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి.. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’
‘నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు , ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ? అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ’ అని బాలయ్య తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలయ్య వ్యాఖ్యలు, ఆ తర్వాత క్షమాపణ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.