బాలకృష్ణ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమానే బ్యాన్‌కు గురైంది. ఈ సినిమాను అప్పటి ప్రభుత్వం రెండు నెలల పాటు బ్యాన్ చేసింది. తర్వాత తగిన కట్‌లతో మళ్లీ రిలీజ్ అయింది.
తండ్రికి తగ్గ తనయుడు అన్నది నందమూరి బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుంది. నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగించటంలో ఆయన ఎక్కడా తగ్గలేదు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లకే స్టార్ హీరోగా మారారు. దాదాపు 40 ఏళ్లుగా టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ మొదటి సారి తండ్రి సినిమాతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1974లో వచ్చిన ‘తాతమ్మ కల’ ఆయన మొదటి సినిమా. ఈ సినిమా 1970లలో భారీ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. తాతమ్మ కలకు స్వయంగా ఎన్టీరామారావు దర్శకత్వం వహించటం విశేషం.
అయితే, ఈ సినిమాను కొన్ని నెలల పాటు అప్పటి ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు కారణం ఏంటంటే.. తాతమ్మ కల సినిమా సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం చేస్తోంది. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనే నినాదాన్ని కూడా తీసుకువచ్చింది. ఈ నినాదానికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయటం జరిగింది. ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా డైలాగులు కూడా ఉంటాయి. దీంతో 1974 ఆగస్టులో విడుదలైన సినిమాను రెండు నెలలు బ్యాన్ చేశారు.
తర్వాత చిత్ర బృందం తగిన మార్పులతో 1975 జనవరి 8న మరోసారి రిలీజ్ చేసింది. సినిమా బంపర్ హిట్ అయి నంది అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమాలో నటనతో బాలకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కూడా తండ్రి దర్శకత్వం పలు సినిమాల్లో నటించారు. హీరోగా ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. ప్రయోగాలు సైతం చేసి వాహ్వా అనిపించుకున్నారు. మరి, బాలయ్య మొదటి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.