బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మాట్లాడే అంశం క్లైమాక్స్ సాంగ్. సినిమాకే ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాటను నిజ జీవితంలో బుర్ర కథలు చెప్పుకునే జంట పాడి, నటించారు. సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరి జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు బలగం గాయకుడు. ఆ వివరాలు..
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి ప్రయత్నంలోనే అందరి చేత ప్రశంసలు అందుకునే రేంజ్‌లో తెరకెక్కించిన చిత్రం బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా.. స్టార్స్ లేకుండా.. చిన్న సినిమాగా విడుదలైన బలగం.. పెద్ద తెర మీద తన బలం ఎంతో చూపించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక బలగం సినిమా ప్రస్తావన వస్తే.. తప్పకుండా చెప్పుకునే అంశం.. క్లైమాక్స్ సాంగ్.. తోడుగా మాతోడుండి.. పాట గురించి. సినిమాకే ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాట చూసి.. కన్నీరు పెట్టని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రేక్షకులను కదిలించింది ఈ పాట. సినిమాలో ఈ పాట పాడుతూ, నటించిన దంపతులు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. సినిమాలో పాట పాడి అందరి చేత కన్నీళ్లు పెట్టించిన ఆ దంపతులు… వాస్తవ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక తాజాగా మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేరాడు. ఆ వివరాలు..
మొగిలయ్య దంపతులు గత 20 ఏళ్లుగా.. బుర్రకథలు చెప్పుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. అరకొర సంపాదనతో ఆర్థిక కష్టాలతో జీవితం సాగిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు.. మొగిలయ్యను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కరోనా సమయంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయనకు ఒకరోజు తప్పించి ఒక రోజు డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ సమస్యలతోనే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మొగిలయ్యను మరో రెండు అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. బీపీ, షుగర్ పెరగడంతో.. ఆయన కళ్లపై ఆ ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం ఆయన రెండు కళ్లు కనిపించడం లేదు. బలగం సినిమా మంచి విజయం సాధించి.. వీరికి గుర్తింపు వచ్చినా.. దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేరు.
మొగిలయ్యకు డయాలసిస్ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్ పాయింట్ దొరకడం చాలా కష్టమైంది అని తెలిపారు వైద్యులు. దాంతో మొగిలయ్య శరీరం మీద దాదాపు 11చోట్ల రంధ్రాలు చేయాల్సి వచ్చింది అన్నారు. చివరకు ఛాతి మీది నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. డాక్టర్ మల్లేశం ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. బాధితులు వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్ సంరక్ష ఆస్పత్రికి రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్య కొమురమ్మ అన్నీతానై బస్సులు, ఆటోలల్లో ప్రయాణాలు చేస్తూ.. తన భర్తను ట్రీట్‍మెంట్ కోసం ఆస్పత్రులకు తిప్పుతుంది.
వరంగల్ సిటీకి వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతున్నది అని చెప్పుకొచ్చింది కొమురమ్మ. మొగిలయ్య వైద్యం కోసం ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని.. వీటిలో 6 లక్షల రూపాయలు అప్పులే చేశామని వెల్లడించింది. ఇక గత కొంత కాలంగా మొగిలయ్య శరీరం డయాలసిస్‌కు కూడా సహకరించడం లేదని తెలిపారు వైద్యులు. మెరుగైన చికిత్స కోసం మరో 3 లక్షలు ఖర్చువుతాయని తెలిపారు. అంతేకాక మరో రెండు ఆపరేషన్‌లు చేస్తే.. కంటి చూపు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకు మరో 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు వైద్యులు. కొన్ని రోజుల క్రితం బలగం డైరెక్టర్ వేణు మొగిలయ్య దంపతులకు కొంత సాయం చేసినా.. అన్ని రకాల ట్రీట్‍మెంట్, మందుల కోసం దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతాయని కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు వీరి సమస్యను పట్టించుకుంటారో లేదో చూడాలి.