బలగం సినిమా కారణంగా ఒక్కటవుతున్న తోబుట్టువులు, కుటుంబాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సినిమా చూసి రియలైజ్ అవుతున్న జనం విడిపోయిన వారితో ఒక్కటవుతున్నారు.
ఇటీవల వచ్చిన “బలగం” సినిమా ప్రేక్షకులందరి మనసుకు హత్తుకుపోయింది. ముఖ్యంగా తెలంగాణల్లోని కుటుంబాల్లో చోటుచేసుకునే పరిణామాలను సినిమాలో బాగా చూపించారు. దర్శకుడు వేణు టిల్లు కుటుంబసభ్యులు కలిసుండటం గురించిన ప్రాధాన్యతను వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్ల తరబడి విడిపోయిన కుటుంబాలు సైతం బలగం సినిమా చూసిన తర్వాత ఒక్కటైపోయాయి. అనవసర పట్టింపులతో దూరమైన బంధువులు కూడా ఈ సినిమా చూసిన తర్వాత తమవారితో కలిసిపోతున్నారు. అదే తరహాలో జనగామ జిల్లాలోని ఓ అక్కా తమ్ముళ్ళ మధ్య ఎడబాటును దూరం చేసి కలిపింది.
ఒకే ఊరిలో ఉంటూ ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా దూరమైన అక్కా తమ్ముళ్ళు బలగం మూవీ చూసిన తర్వాత ఒకరినొకరు కలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నేలమంచి వీరరెడ్డి, కొమలమ్మలకు నలుగురు సంతానం. మొదటి ఇద్దరు యాదమ్మ, గాలమ్మ, తర్వాత ఇద్దరు భూపాల్ రెడ్డి, పద్మారెడ్ది. తొమ్మిది సంవత్సరాల క్రితం గాలమ్మ చిన్న కొడుకు పెండ్లి జరిగింది. ఆ సమయంలో సాంప్రదాయం ప్రకారం పుట్టింటి నుండి రావలసిన బియ్యం సారె కార్యక్రమం అన్నదమ్ములు చేపట్టలేదు.
అప్పటినుంచి మనస్పర్దలు పెరిగి, బంధాలు కూడా తెగిపోయాయి. నాలుగు కుటుంబాల వారు దూరమైపోయారు. ఒకే ఊరిలో ఉంటున్నా.. ఒకరినొకరు పలకరించుకోరు, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లరు. శుభకార్యాలకు కూడా పిలుపులు లేవు. కుటుంబాలు విడిపోయాయి. ఈ మధ్య ఆ గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ప్రొజెక్టర్ పెట్టి బలగం సినిమా చూపించారు. ఊరంతా ఈ సినిమా చూశారు. రెండుమూడు రోజుల్లో అక్కా తమ్ముళ్లందరు కలిసిపోయారు. ఊరిలో గ్రామ దేవతల పండుగ చేసే క్రమంలో ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించి ఆనందోత్సాహాలతో పండగను నిర్వహించుకున్నారు. ఇప్పుడు అందరి కలయికతో నాలుగు కుటుంబాలు సంతోషంతో ఉంటున్నారు. మరి, విడిపోయిన కుటుంబసభ్యుల్ని కలుపుతున్న బలగం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.