సినీ పరిశ్రమలో వరుసగా నటీనటులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సినిమా చిత్రీకరణ సమయాల్లో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సంజయ్ దత్ , తంగలన్ షూటింగ్ సమయంలో విక్రమ్ గాయపడ్డారు. ఇప్పుడు..
సినీ పరిశ్రమలో వరుసగా నటీనటులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సినిమా చిత్రీకరణ సమయాల్లో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సంజయ్ దత్ , తంగలన్ షూటింగ్ సమయంలో విక్రమ్ గాయపడిన సంగతి విదితమే. మొన్నటికి మొన్న యువ నటుడు వరుణ్ సందేశ్ షూటింగ్ సమయంలోనే గాయపడ్డాడు. అలాగే మాలీవుడ్ సూపర్ స్టార్ పృధ్వీ సుకుమారన్ కూడా తీవ్రంగా గాయపడి.. మూడు నెలల పాటు రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. నటి రేణు దేశాయ్ కూడా కాలికి గాయమైనట్లు ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటుడికి గాయాలయాయన్న వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రమాదం బారిన పడ్డారు. ఓ షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. షూటింగ్ నిమిత్తం టీమ్ అంతా లాస్ ఏంజెల్స్ వెళ్లింది. చిత్రీకరణ సమయంలో ఆయన ముక్కుకు దెబ్బతగిలింది. దీంతో కొంత రక్తం కారగా.. చిత్ర యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయనకు చిన్న సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. షారూఖ్‌కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన జవాన్, దుంఖీ ప్రాజెక్టుతో బిజీ బిజీగా గడుపుతున్నారు.