బాబు మోహన్.. తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీ అంటే అందమైన రూపం, మంచి ఎత్తు ఉండాలని భావించే రోజుల్లో.. అవేవి లేకున్నా ప్రతిభ ఉంటే చాలని నిరూపించి.. టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. ఎన్నో వందల చిత్రాల్లో నటించాడు. ఆల్ ఇండియా అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సౌందర్య వంటి అగ్ర హీరోయిన్ సైతం ఆయనతో నటించిందంటే.. ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో కోట శ్రీనివాస్‌తో కలిసి బాబు మోహన్ చేసే కామెడీ నెక్స్ట్ లెవల్. వీరి పెయిర్‌కు చాలా ఆదరణ ఉండేది. అలా ఏళ్ల పాటు పరిశ్రమలో హాస్య నటుడిగా.. ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా గెలిచాడు. కొన్ని రోజులు టీఆర్‌ఎస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ తన జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ఆ వివరాలు..
సినిమాలు చేసేటప్పుడు.. ‘‘నాకు భరణి పాన్ అలవాటు చేశారు. అది వ్యసనంగా మారింది. రోజుకు 30 వరకు తినేవాడిని. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు.. ఒక డబ్బాలో పాన్‌లు తీసుకెళ్లేవాణ్ణి. మంత్రి అయిన తరువాత చంద్రబాబుగారి వద్దకు వెళ్లినప్పుడు కూడా పాన్ తింటూనే వెళ్లడం అలవాటైంది. ఇక హైదరాబాద్ రావాలంటే సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని. ఆ సమయంలో ఒక పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకుని వెళ్లేవాడిని. అదే అలవాటు కొనసాగించాను. ఆ అలవాటులోనే భాగంగా ఓ రోజు ఆ షాప్‌లో పాన్ కట్టించుకుని వెళ్తున్నాను. కొంచెం దూరం వెళ్లాక పాన్ డబ్బా తెరిచి తిందాము అనుకుంటడగా.. పాన్ షాప్ అతడు ఫోన్ చేశాడు. పాన్ తినొద్దని చెప్పాడు. దానిలో విషం ఉందని వెల్లడించాడు. ఆ తర్వాత అతడి భార్య ఫోన్ చేసి నా ప్రత్యర్థులు బెదిరించడం వల్లనే అలా చేశామని చెప్పి ఏడ్చింది. ఆ రోజు అర్థమైంది రాజకీయాలు ఇంత నీచంగా, భయంకరంగా ఉంటాయని’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక పాన్ అలవాటును ఎలా మానేసారు అని కూడా చెప్పుకొచ్చాడు బాబు మోహన్. ‘‘ఓసారి సెంట్రల్ మినిస్టర్‌తో మీటింగులో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నపుడు.. వచ్చిన కేంద్ర మంత్రి బీడా తింటున్నారు. ఇక నేను ఊరికే ఉంటే చంద్రబాబు నాయుడు.. నన్ను తిను పర్వాలేదు అన్నట్లుగా సైగ చేసారు కానీ నాకు ఆయన ముందు అలా పాన్ తినాలని అనిపించలేదు. ఇక ఆ తరువాత మెల్లగా ఆ అలవాటును మానేసాను అంటూ చెప్పారు. టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌కు ఆ తరువాత ఇప్పుడు బీజేపీలోకి మారడం గురించి కూడా చెప్పుకొచ్చాడు. టీడీపీ, బీజేపీ రెండూ ఒకే పార్టీనే. నా దృష్టిలో రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు, తెలంగాణ రాక ముందు వరకు రెండూ కలిసే ఉన్నాయి. ఇక టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లంతా.. టీడీపీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. ఇవన్నీ వేరే పార్టీలు ఎలా అవుతాయి. కాంగ్రెస్ మాత్రమే వేరే పార్టీ’’ అంటూ చెప్పుకొచ్చాడు.