హైదరాబాద్ దుర్గం చెరువ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డ సాయి ప్రస్తుతం జుబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని.. దేవున్ని ప్రార్థిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఆసుపత్రికి బారులు తీరారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం విషయమై నటుడు బాబు మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడి మరణాన్ని గుర్తి చేసుకొని ఎమోషన్ అయ్యారు. తన కుమారుడు స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. పిల్లలు పోతే తల్లిదండ్రులకు ఉండే ఆ కడుపుకోతను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాక్సిడెంట్ జరిగి వాళ్ళు పోతే పోయారు కానీ అతన్ని ప్రేమించిన వాళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తారు. అందరూ అది ఆలోచించుకోవాలని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని బాబుమోహన్ చెప్పుకొచ్చారు.
ఇక సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడన్న మోహన్ బాబు.. ‘కొందరు హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీలా ఫీలవుతారు. కానీ ఆ హెల్మెట్ ప్రాణాలు రక్షిస్తుందన్న విషయం మర్చిపోతుంటారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయి యాక్సిడెంట్ కాగానే చతికిలపడతారు.. ఇది వాళ్లకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కడుపు కోత అన్న విషయం మర్చిపోవొద్దని అన్నారు. ఓ తండ్రి తన కళ్ల ముందు కుమారుడిని కోల్పోతే.. తండ్రి శరీరం కాలిపోయేవరకు ఆ దుఃఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ బాధను ఎవరూ తగ్గించలేరు. బైక్ నడిపేటపుడు తమ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాని రిక్వెస్ట్ చేస్తున్నా’ అంటూ బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.