హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ అతి త్వరలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు..
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడేవారికి బాగా నచ్చే చిత్రాల్లో ‘అవతార్’ ఒకటి. దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2009లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ మూవీ ప్రతిచోట కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాంటి ‘అవతార్’కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి సుదీర్ఘ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ.. దాదాపు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ రిలీజైంది. గతేడాది డిసెంబర్ 16న ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ‘అవతార్’లానే ఈ మూవీ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా ఇన్నాళ్లూ అద్దె ప్రాతిపదికన పలు డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో సందడి చేసింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
రెంట్ చెల్లించకుండానే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాన్ని హాట్‌స్టార్ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంచనుంది. ఈ విజువల్ వండర్‌ను జూన్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని హాట్‌స్టార్ ఇంకా వెల్లడించలేదు. ఇక ‘అవతార్-2’ స్టోరీ విషయానికొస్తే.. భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ (సామ్ వర్తింగ్టన్) అక్కడే ఒక తెగకు చెందిన నేతిరి (జో సల్దానా)ను ప్రేమించి పెళ్లాడతాడు. అలాగే ఆ తెగకు నాయకుడు అవుతాడు. ఆ తర్వాత జేక్-నేతిరి దంపతులకు ముగ్గురు పిల్లలు పుడతారు. జేక్ తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. ఇంతలో పండోరాను ఆక్రమించేందుకు కొందరు మనుషులు సాయుధులై దండెత్తుతారు. ఈ నేపథ్యంలో జేక్ తన కుటుంబాన్ని, తెగను ఎలా కాపాడుకున్నాడు, శత్రువులను మట్టుబెట్టాడా లేదా అనేది మిగిలిన కథ.
#AvatarTheWayOfWater is streaming on @disneyplus June 7 🌊 pic.twitter.com/MN1KqGTzw0
— Avatar (@officialavatar) May 15, 2023