‘అవతార్’ సినిమా అసలు ఎందుకు నచ్చింది అని అడగ్గానే.. చాలా మంది చాలా కారణాలు చెబుతారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.. పండోరా గ్రహం, అందులో నీలం రంగు మనుషులకు కనెక్ట్ అయిపోయాం. సినిమా చూస్తున్నంతసేపు వాళ్లలో నేను ఒకడిని అయిపోయాను. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తీశాడు. వేల కోట్ల కలెక్షన్స్ సాధించింది… ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన కారణాలు చెబుతారు. సినిమా చూడటానికి ఇవన్నీ కారణం అయ్యిండొచ్చు కానీ ఇవే రీజన్స్ అంటే మాత్రం అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే ‘అవతార్’ సినిమాలో అంతకు మించిన డెప్త్ ఉంది. దాని గురించి విడమరిచి చెప్పే ప్రయత్నమే ఈ స్టోరీ.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మనిషి చేస్తున్న దౌర్జన్యం కథ, తాము బతకడం కోసం నావి అనే ఓ తెగ చేసే పోరాటం కథ, అన్నింటికీ మించి జేక్ సల్లీ అనే కాళ్లు చచ్చుబడిపోయిన ఓ మెరైన్ సోల్జర్.. నావి తెగలో ఒకడిగా మారే కథనే ‘అవతార్’. ఇక సినిమా స్టోరీ చూసుకంటే.. భూమికి చాలా దూరంగా పండోరా గ్రహం ఉంటుంది. అక్కడ నావి అనే ఆటవిక తెగ ఉంటారు. చూడటానికి మనుషుల్లా కనిపించినా ఎత్తు, పొడుగు, తోక, మెరిసే నీలం రంగు చర్మం, ప్రత్యేకమైన భాష మాట్లాడుతూ తమదైన ప్రపంచంలో బతుకుతుంటారు. పండోరాలో మన ఊపిరి పీల్చుకోవడం దాదాపు అసాధ్యం. ముఖానికి మాస్క్ లేకపోతే 4 నిమిషాల్లో చనిపోతాం. అలాంటి చోటుకు జేక్ సల్లీ వెళ్తాడు. జేక్ బ్రదర్ టామ్, అవతార్ ప్రోగ్రామ్ కోసం పనిచేస్తుంటాడు. కానీ టామ్ చనిపోవడంతో అతడి స్థానంలో జేక్ వెళ్తాడు.
జేక్ వెళ్లడానికి ముందే RDA కంపెనీ అక్కడికి ఉనబ్టేనియమ్ అనే ఖనిజం దక్కించుకోవాలని చూస్తూ ఉంటుంది. నావి ప్రజల్ని ఒప్పించి, దాన్ని సొంతం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక అవతార్ ప్రోగ్రామ్ లో భాగమైన హీరో జేక్.. నావి తెగ నిజాయతీకి, ప్రకృతితో బతుకుతున్న వారి జీవన విధానానికి ముగ్దుడై హీరోయిన్ నేతిరితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే నావి ప్రజలతో కలిసి.. తనని పండోరాపై తీసుకొచ్చిన RDA సంస్థపైనే ఎదురు తిరుగుతాడు. దీంతో మనుషులు-నావి తెగ మధ్య భీకర పోరాటం జరుగుతుంది. చివరకు జేక్, నావి తెగని ఎలా రక్షించాడు, వాళ్లలో ఒకడిగా ఎలా కలిసిపోయాడు అనేది ‘అవతార్’ స్టోరీ. మన వాళ్ల కోసం, మన భూమి కోసం ఎంతవరకైనా సరే వెళ్లాలి అనే పాయింట్ కు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోయారు.
ఇక ‘అవతార్’ టైటిల్ చూడగానే మనం ఇది ఎక్కడో విన్నా కదా అనిపిస్తుంది. అవును హిందూ పురాణాల్లో దేవుడు పలు అవతారాల్లో కనిపించాడు. ‘అవతార్’ మూవీ టైటిల్ దాని నుంచే ఇన్ స్పైర్ అయి పెట్టినట్లు తెలుస్తోంది. ఓ మనిషి వేరే అవతారంలో వెళ్లి ప్రకృతి, మనుషుల్ని కాపాడటం అనేది హిందూ పూరాణాల్లో ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. అంతెందుకు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నీలం రంగు మేనిఛాయతో ఉండేవారు. అవతార్ సినిమాలోనూ నావి ప్రజల్ని నీలం రంగులో చూపించడానికి ఇదే కారణం అయ్యిండొచ్చు. జేక్ అనే ఓ సాధారణ మనిషి, అవతార్ గా మారి మనుషుల నుంచి నావి తెగను రక్షిస్తాడు. మన దేవుడు విష్ణుమూర్తికి గరుడపక్షి వాహనంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ హీరో జేక్ కి తోరూక్ అనే పక్షిని వాహనంగా చేసుకుంటాడు. ఇలా ఏ కోణంలో చూసినా సరే హిందూయిజంకు అవతార్ సినిమాలతో చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కనబెడితే.. ‘అవతార్’ సినిమా మన నేచర్, దాన్ని మనిషి ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి పూస గుచ్చినట్లు చెబుతుంది.
అవతార్ అనగానే అందరూ గ్రాఫిక్స్ గురించే మాట్లాడుకుంటారు కానీ.. మ్యాన్ వర్సెస్ నేచర్ అనే థీమ్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ జానర్ లో తీసిన బెస్ట్ మూవీ అంటే అందరూ చెప్పే ఒకేఒక్క మాట అవతార్. మనుషులం భూమిని ఎలా నాశనం చేస్తున్నాం, ఎంత కూర్రంగా ప్రవర్తిస్తున్నాం అనే దానిపై డైరెక్టర్ చేసిన హర్ష్ కామెంటే అవతార్ సినిమా. అలా అని ఈ విషయాన్ని సీరియస్ గా కాకుండా చాలా ఎంటర్ టైనింగ్ గా జేమ్స్ కామెరూన్ చూపించాడు. ప్రపంచంలో ప్రతిచోటా ‘అవతార్’ ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం.. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తమదిగా ఓన్ చేసుకున్నారు. నావి పీపుల్ కావొచ్చు, మనుషుల్లో కావొచ్చు.. తమని తాము చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో జేక్ అనే హోప్ లెస్ పర్సన్.. తనని తాను డిస్కవరీ చేసుకుని, తన లైఫ్ కి ఓ మీనింగ్ ఉందని తెలుసుకుంటాడు. ఈ విషయాన్నీ మన జీవితానికి అన్వయించుకోవచ్చు.
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. తన ప్రతి సినిమాని కూడా కలలో వచ్చిన ఆలోచనల ఆధారంగానే తీస్తుంటాడు. ‘అవతార్’ కూడా అలానే తెరకెక్కించాడు. 1997లో ‘టైటానిక్’ రిలీజ్ చేసిన తర్వాత 12 ఏళ్లకు ‘అవతార్’ని థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ‘అవతార్ 2’ని థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. తను నమ్మిన ఆలోచన కోసం, టికెట్ కొని థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడి కోసం ఎంతవరకైనా వెళ్లే జేమ్స్ కామెరూన్ పట్టుదల కోసమైనా సరే మనం ఈ సినిమా చూసి తీరాలి. పండోరా గ్రహంలో మరోసారి మనం విహరించాలి. తొలి భాగంలో భూమిని మనం ఎలా కాపాడుకోవాలో కామెరూన్ చెప్పాడు. ఇప్పుడు రెండో భాగంలో నీటిని ఎలా సంరక్షించుకోవాలో చెప్పబోతున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. నీటిని గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయడం చాలా కష్టమైన విషయం. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న కామెరూన్.. మొత్తం ‘అవతార్ 2’ని నీటిలో తీసి పడేశాడు. ట్రైలర్స్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక థియేటర్లలో సినిమాని చూస్తే రచ్చ రచ్చే.
త్రీడీ, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. డైరెక్టర్లు సినిమాలు తీసే పద్ధతిని పదమూడేళ్ల క్రితమే మార్చేసిన వ్యక్తి జేమ్స్ కామెరూన్. ‘అవతార్ 2’ కోసం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యంత అడ్వాన్స్ డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన గ్రాఫిక్స్ టెక్నాలజీని ఉపయోగించాడు. ఈసారి ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేసుంటాడో మీ ఊహకే వదిలేస్తున్నాం. ‘అవతార్ 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం స్టార్ట్ చేశారు. 2017లో షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇలా ఒక్క సినిమా కోసం ఇంత కష్టపడ్డారంటే.. వాళ్ల పడిన శ్రమ కోసమైనా సరే ‘అవతార్ 2’ చూసి వాళ్లని అభినందించి తీరాలి. 2009లో రిలీజైన ‘అవతార్’ ఫస్ట్ పార్ట్.. 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. వరల్డ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇప్పటికీ రికార్డ్ హోల్ట్ చేసుంది.
ఓ ఇంగ్లీష్ సినిమా.. అది కూడా మన థియేటర్లలో 100 రోజులు ఆడటం అనే విషయం చాలా అరుదు. దాన్ని ‘అవతార్’ సినిమా రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించింది. ఇప్పుడు ‘అవతార్ 2’ ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ఏకంగా 52 వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సినిమా ‘అవతార్ 2’. ఇలా విడుదలకు ముందే ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం.. ప్రేక్షకుడిని ఓ మాయా లోకంలోకి తీసుకెళ్లి, వసూళ్ల సునామీ సృష్టించడం గ్యారంటీ. మీలో ఎంతమంది ‘అవతార్ 2’ చూడటానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ చూసి మీరేం నేర్చుకున్నారు. ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసుకుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.