ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. ఫస్ట్ పార్ట్ లో భూమిపై జరిగే యుద్ధాన్ని చూపించారు. సెకండ్ పార్ట్ లో మాత్రం నీడు అడుగున జరిగే యుద్ధాన్ని చూపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్.. యూట్యూబ్ లో మోత మోగిస్తున్నాయి. మొబైల్ స్క్రీన్ లో చూస్తుంటేనే ఓ రకమైన ఎగ్జైట్ మెంట్ వస్తుండగా.. ఇక థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని మూవీ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. టికెట్ రేట్ ఎంతైనా సరే కొనేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనని ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ‘అవతార్ 2’పై నిషేధం అని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచం మెచ్చే డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. విజువల్ వండర్స్ తీయడంలో ఆయనో ఎక్స్ పర్ట్. 1997లో ‘టైటానిక్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. 2009లో ‘అవతార్’ రిలీజ్ చేసి, ప్రేక్షకులు మైమరచిపోయేలా చేశారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయని చెప్పేసరికి ప్రేక్షకులు ఆనందంతో ఎగిరి గంతేశారు. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా? అని తెగ వెయిట్ చేశారు. ఫైనల్లీ 13 ఏళ్ల తర్వాత డిసెంబరు 16న వరల్డ్ వైడ్.. ‘అవతార్ 2’ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్స్, హాట్ కేకుల్లా సేల్ అవుతున్నయి. ఇలాంటి టైంలో సినిమాపై బ్యాన్ అని న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని ఫియూక్ (ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ-FEUOK)ప్రకటించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
‘అవతార్ 2’ సినిమాను కేరళలోనూ డిస్నీనే పంపిణీ చేస్తోంది. సాధారణంగా పంపిణీదారులకు, థియేటర్లకు మధ్య ఒప్పందం ప్రకారం సినిమాని రిలీజ్ చేస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఇది ఒక్కోలా ఉంటుంది. కేరళలో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్లకు మధ్య అగ్రిమెంట్ కుదరకపోవడం వల్ల ‘అవతార్ 2’ రిలీజ్ విషయంలో వివాదం మొదలైంది. రిలీజైన తొలి మూడు వారాల్లో 60 శాతం షేర్లు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇవ్వాలని డిస్నీ కోరింది. అయితే ఫియూక్ నిబంధనల ప్రకారం 55 శాతం కంటే ఎక్కువ షేర్లు ఇవ్వలేమని థియేటర్ యాజమానులు చెబుతున్నారు. ఇంకా పొత్తు కుదరకపోవడం వల్లే బ్యాన్ అనే మాట వినిపిస్తుంది. ఫియూక్ రూల్స్ ప్రకారం.. ఇతర భాషా చిత్రాలకు 50 శాతం షేర్స్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నామని, అంతకంటే ఎక్కువ ఇస్తే తాము నష్టపోతామని థియేటర్ ఓనర్స్ చెబుతున్నారు. ‘అవతార్ 2’ని కేరళలో నిషేధించలేదని, డిస్ట్రిబ్యూటర్ పెట్టే కండీషన్స్ మాత్రమే అంగీకరించట్లేదని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది.