ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన తర్వాత ఆయనకు ప్రపంచం నలుమూలలనుంచి సన్మానాలు, ప్రశంసలు అందుతున్నాయి.
చంద్రబోస్.. మొన్నటి వరకు ఈయన ఓ ప్రాంతీయ సినీ పాటల రచయిత. కానీ, ఇప్పుడు ఇంటర్ నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రచయిత. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘‘ నాటు నాటు’’ పాట ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇంటర్ నేషనల్ లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చింది. ఏకంగా సినీ ప్రపంచం గొప్పదిగా భావించే ఆస్కార్ అవార్డును ఆయన సొంతం చేసింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారత సినీ పాటల రచయితగా చంద్రబోస్ చరిత్రలో మిగిలిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ పలు సంస్థలు, ప్రభుత్వాలు ఘన సన్మానాలు చేస్తున్నాయి.
తాజాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం చంద్రబోస్ సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేసింది. ఆయన్ని పిలిచి మరీ ప్రత్యేకంగా సన్మానించింది. బుధవారం మెల్‌బోర్న్‌లోని పార్లమెంట్ ఆఫ్ విక్టోరియా భవనంలో చంద్రబోస్ సన్మాన వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ఉన్నతాధికారులు మిస్టర్ లీ, మిస్టర్ మాట్‌లతో పాటు మరికొందరు పాల్గొన్నారు. మిస్టర్ లీ, మిస్టర్ మాట్‌లు చంద్రబోస్‌కు ‘‘ రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్’’ అవార్డును అందించారు. ఆయన సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు.
కాగా, చంద్రబోస్ 1995లో తాజ్ మహల్ చిత్రం ద్వారా గేయ రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా సినిమాలకు పనిచేశారు. దాదాపు 5 వేలకుపైగా పాటలు రాశారు. గేయ రచయితగా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటతో అప్పటి వరకు రాని గుర్తింపు వచ్చింది. నేడు గ్లోబల్ స్టార్ లిరిసిస్ట్‌గా అందరి మన్ననలు పొందుతున్నారు. మరి, ఆస్ట్రేలియా ప్రభుత్వం చంద్రబోస్‌ను ఘనంగా సన్మానించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.